Tollywood: కథకే కాదు విజయానికీ కొనసాగింపే

కొనసాగింపు చిత్రాల ట్రెండ్‌ను తెలుగు చిత్రసీమ ఎప్పుడో అందిపుచ్చుకుంది. అయితే ఆరంభంలో ఈతరహా ప్రయత్నాలు అంతగా అచ్చిరాలేదు. కానీ, ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలకు దక్కిన ఆదరణతో లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.

Updated : 16 Dec 2022 09:02 IST

2022లో మెప్పించిన సీక్వెల్‌ చిత్రాలు


కొనసాగింపు చిత్రాల ట్రెండ్‌ను తెలుగు చిత్రసీమ ఎప్పుడో అందిపుచ్చుకుంది. అయితే ఆరంభంలో ఈతరహా ప్రయత్నాలు అంతగా అచ్చిరాలేదు. కానీ, ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలకు దక్కిన ఆదరణతో లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఈ విజయమిచ్చిన స్ఫూర్తితో కొన్నేళ్లుగా తెలుగులో కొనసాగింపు చిత్రాల జోరు పెరిగింది. హిట్టు మాట వినిపించిన సినిమాల్ని కొందరు ఫ్రాంచైజీల్లా కొనసాగిస్తే.. మరికొందరు ఓ కథను రెండు భాగాలుగా చెప్పడం మొదలు పెట్టారు. ఈ ఏడాది ఈతరహా సినిమాలు అరడజను వరకు బాక్సాఫీస్‌ ముందుకొచ్చాయి. మరి వీటిలో ప్రేక్షకుల మెప్పు పొందినవి ఎన్ని? వాటి విశేషాలేంటి?

‘ఎఫ్‌2’తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా అనిల్‌ తెరకెక్కించిన మరో చిత్రమే ‘ఎఫ్‌3’. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మేలో బాక్సాఫీస్‌ ముందుకొచ్చింది. అయితే తొలి భాగంతో పోల్చితే ఈ రెండో భాగం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. వాణిజ్యపరంగా చక్కటి విజయాన్నే అందుకొంది. దాదాపు రూ.70కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా రూ.134కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక జూన్‌లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘విక్రమ్‌’. కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ఈ సినిమాని లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించారు. ఒకరకంగా ఇదీ కొనసాగింపు చిత్రాల కోవకు చెందిన సినిమానే. ఎందుకంటే 1986లో విడుదలైన కమల్‌ ‘విక్రమ్‌’ కథకు కొనసాగింపుగానే ఈ చిత్ర కథను అల్లుకున్నారు లోకేష్‌. దాన్ని కార్తి ‘ఖైదీ’ చిత్ర కథతో ముడివేస్తూ.. తనదైన ఓ సరికొత్త కథా ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఈ ప్రయోగం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిచ్చింది. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘విక్రమ్‌2’, ‘ఖైదీ2’ చిత్రాలు రానున్నాయి.



ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో దాదాపు ఇరవై వరకు హిట్లు కనిపిస్తే.. అందులో కొనసాగింపు చిత్రాలే అరడజను వరకు ఉన్నాయి. ఆరంభంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ లాంటి బడా చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచినా.. కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి వల్ల వాటి రాక వీలు పడలేదు. కానీ, ఆ కొవిడ్‌ భయాల మధ్యే ‘బంగార్రాజు’తో పండగ బరిలో నిలిచి మెరుపులు మెరిపించారు నాగార్జున, నాగచైతన్య. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమాని కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. తొలి సినిమా కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ రెండో భాగం కథ మొదలవుతుంది. తొలి సినిమాలో లాగే ఇందులోనూ నాగార్జున బంగార్రాజుగా కనిపించగా.. నాగచైతన్య చిన్న బంగార్రాజుగా సందడి చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. బాక్సాఫీస్‌ ముందు చక్కటి వసూళ్లనే దక్కించుకుంది. దాదాపు రూ.25కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.63కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ‘బాహుబలి’ స్ఫూర్తితో రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న సినిమా ‘కేజీఎఫ్‌’. మూడేళ్ల క్రితం విడుదలైన తొలి భాగం సంచలన విజయం దక్కించుకొని సత్తా చాటగా.. ఈ ఏడాది విడుదలైన రెండో భాగం అంతకు మించిన భారీ విజయంతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపింది. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. ఇందులో రాఖీ భాయ్‌గా యశ్‌ చూపిన యాక్షన్‌ హంగామాకు, ప్రశాంత్‌ టేకింగ్‌ స్టైల్‌కు ఇటు సినీప్రియులతో పాటు అటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.1200కోట్ల వసూళ్లు రాబట్టినట్లు లెక్కలు వేస్తున్నారు.


సైన్స్‌కి.. ఇతిహాసాన్ని జత చేసి లాజిక్‌గా కథ చెబితే.. ప్రేక్షకులు బాగానే చూస్తారని ‘కార్తికేయ’తో నిరూపించారు దర్శకుడు చందూ మొండేటి. దీంతో ఆ ఆలోచన నుంచే ఆయన మరో ఆసక్తికరమైన కథను అల్లుకొని ‘కార్తికేయ2’ని ముస్తాబు చేశారు. నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన ఈ కొనసాగింపు చిత్రం.. ఈసారి పాన్‌ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించింది. తొలి భాగంలో మెడికోగా ఓ ఆలయం వెనకున్న రహస్యాన్ని ఛేదించిన నిఖిల్‌.. ఈ రెండో భాగంలో డాక్టర్‌గా శ్రీకృష్ణుడి కాలి కంకణాన్ని అన్వేషిస్తూ ప్రయాణం సాగించారు. దాన్ని చందూ ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది. అందుకే దాదాపు రూ.20కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాకి.. బాక్సాఫీస్‌ వద్ద రూ.120కోట్ల పైచిలుకు వసూళ్లు దక్కాయి. ‘హిట్‌’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల మెప్పు పొందిన దర్శకుడు శైలేష్‌ కొలను. ఈ విజయమిచ్చిన స్ఫూర్తితోనే ‘హిట్‌’ను ఓ యూనివర్స్‌లా మార్చి.. అడివి శేష్‌ కథానాయకుడిగా ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ను తీసుకొచ్చారు శైలేష్‌. దీనికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. ఓ సైకో కిల్లర్‌ కథతో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిన తీరుకు ఇటు సినీప్రియులతో పాటు అటు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ ఫ్రాంఛైజీలో రానున్న తదుపరి సినిమాలో నాని కథానాయకుడిగా కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని