ఏ దర్శకుడికి గెలిచే ‘ఆస్కార’మో!

ఆస్కార్‌ పురస్కారాల్లో కీలకమైన వాటిల్లో ఒకటి ఉత్తమ దర్శకుడు. ఈ ఏడాది ఈ అవార్డుని గెలుచుకునేది ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది.

Published : 26 Feb 2023 01:32 IST

ఆస్కార్‌ పురస్కారాల్లో కీలకమైన వాటిల్లో ఒకటి ఉత్తమ దర్శకుడు. ఈ ఏడాది ఈ అవార్డుని గెలుచుకునేది ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఈసారి రేసులో తొలిసారి నామినేషన్‌ దక్కించుకున్న వాళ్లు మొదలు గతంలో ఆస్కార్‌ అందుకున్న వాళ్లకు ఉన్నారు. మరి చివరికి ఎవరిని పురస్కారం వరిస్తుందో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. బరిలో ఉన్న దర్శకులెవరు? వాళ్లు తీర్చిదిద్దిన చిత్రాల విశేషాలేంటి?.


స్పీల్‌బర్గ్‌ ఆటోబయోగ్రఫీ

ఈ ఏడాది ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేషన్‌ దక్కించకున్నారు ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌.  ‘ది ఫాబెల్స్‌మాన్‌’ చిత్రానికి ఈ నామినేషన్‌ వచ్చింది. ఆయన తన ఆటోబయోగ్రఫీనే సినిమాగా తీసారు. బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఆయనకు తన కెమరాతో సినిమాలు తీయాలని ఉండేది. సినిమాలు తీస్తూ జీవితంలో ఆయనకి ఎదురైన పరిస్థితులని ఇందులో చూపించారు. హాలీవుడ్‌లో కొత్త శకానికి నాంది పలికిన వ్యక్తి. చలనచిత్ర దర్శకుడు, నిర్మాతగా బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు మార్గదర్శకుడు. 34 సినిమాలను తెరకెక్కించడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైన దర్శకుడు స్పీల్‌ బర్గ్‌. ఆయన ‘ది షుగర్‌ల్యాండ్‌ ఎక్స్‌ప్రెస్‌(1974)’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన మూడు అకాడమీ అవార్డులు, నాలుగు డైరెక్టర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా అవార్డ్స్‌తో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన ఏడు సినిమాలను నేషనల్‌ ఫిల్మ్‌ రిజిస్ట్రీ లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌లో చేర్చారు. 1995లో ఏఎఫ్‌ఐ లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, 2015లో ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ అవార్డు ..ఇలాంటి ఎన్నో అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు.


డార్క్‌ కామెడీ చిత్రాలతో గుర్తింపు

లండన్‌కి చెందిన మెక్‌డొనాగ్‌ ఒక బ్రిటన్‌ నాటక రచయిత, దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన ‘ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిస్‌(2022) చిత్రానికి 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నారు. ఈ చిత్రంలో కోల్మ్‌, పాడ్రాయిక్‌ అనే ఇద్దరి స్నేహం గురించి, వారిలో ఒకరు మాట్లాడకుండా ఉంటే ఎలాగైనా వారి స్నేహబంధాన్ని సరిచేసుకోవడానికి బయలుదేరిన పాడ్రాయిక్‌కు ఎదురైన పరిస్థితులను ఇందులో చూపించారు. డొనాగ్‌  డార్క్‌ కామెడీ చిత్రాలతో గుర్తింపు పొందారు.. 2003లో ‘ది పిల్లో మ్యాన్‌’తో తన కెరీర్‌ను ప్రారంభించారు..బ్రాడ్‌వేలో అనేక నాటకాలను రచించారు. ‘ది బ్యూటీ క్వీన్‌ ఆఫ్‌ లీనెన్‌(1996), ది క్రిప్పల్‌ ఆఫ్‌ ఇనిష్మాన్‌(1996), ది లోన్సమ్‌ వెస్ట్‌(1997) నాటకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.


సంగీత వీడియోతో దర్శకులుగా డానియల్స్‌..

అమెరికన్‌ దర్శకులు డానియల్‌ క్వాన్‌, డానియల్‌ స్కీనెర్ట్‌లు  ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌(2022)’ చిత్రానికి 95వ అకాడమీ అవార్డులో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేట్‌ అయ్యారు. వీళ్లని డానియల్స్‌ అని పిలుస్తారు. ఒక చైనీస్‌ వలసదారు తన కుటుంబాన్ని మల్టీవర్స్‌ కలిగించే ప్రమాదాల నుంచి ఎలా కాపాడుకుంటుందో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’లో చూపించారు. ఈ ఇద్దరూ ‘టర్న్‌ డౌన్‌ ఫర్‌ వాట్‌ (2013)’లో సంగీత వీడియోతో దర్శకులుగా తమ వృత్తిని ప్రారంభించారు. వాస్తవిక కామెడీ చిత్రం ‘స్విస్‌ ఆర్మీ మ్యాన్‌’కు దర్శకత్వం వహించి 2016లో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2022లో చికాగో ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌, డల్లాస్‌-ఫోర్ట్‌ వర్త్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకులుగా అవార్డును గెలుచుకున్నారు.


వ్యంగ్య చిత్రాలు తీయడంలో దిట్ట

95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేట్‌ అయిన మరో దర్శకుడు రూబెన్‌ ఓస్ట్‌లండ్‌. ఆయన బ్లాక్‌ కామెడీ, వ్యంగ్య చిత్రాలు తీయడంలో గుర్తింపు పొందిన స్వీడిష్‌  చిత్రనిర్మాత. ఆయన ఆంగ్ల భాషలో తెరకెక్కించిన మొదటి సినిమా ‘ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌(2022)’తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కొందరు సాధారణ ప్రజలు సంపన్న అతిథులతో కలిసి ఓడలో విహారయాత్రకు వెళ్తే, అక్కడ వారు ఎదుర్కొన్న పరిణామాలను ఈ సినిమాలో చూపించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ది స్క్వేర్‌(2018)’ చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పోటీలో ‘పామ్‌ డిఓర్‌’ని గెలుచుకుంది. 2020లో ఆయన స్వీడన్‌ చలనచిత్రం రంగంలో చేసిన గణనీయమైన కృషికి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.


విభిన్న సామర్థ్యాల టాడ్‌ ఫీల్డ్‌

నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ రైటర్‌గా విభిన్న సామర్థ్యాలలో పనిచేసిన అమెరికాకి చెందిన విలియం టాడ్‌ ఫీల్డ్‌ ‘టార్‌’ చిత్రంతో ఈ ఏడాది అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నారు. కండక్టరుగా పని చేస్తున్న లిడియా టార్‌, ఆమెకి ఎదురైన లైంగిక వేధింపుల ఆరోపణలను ఏవిధంగా ఎదుర్కొని సంగీత విద్వాంసురాలిగా నిలిచిందనేది ఇందులో చూపించారు. ఆయన ‘ది బెడ్‌రూమ్‌(2001), లిటిల్‌ చిల్డ్రన్‌(2006) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘టార్‌’ లండన్‌ ఫిల్మ్‌క్రిటిక్స్‌ సర్కిల్‌ ద్వారా 2022లో ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఆయన బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ‘సత్యజిత్‌ రే’ అవార్డును, సన్‌డాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో జ్యూరీ ప్రైజ్‌ను అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు