‘వహీదా’ అభినయానికి ‘వెండితెర ఫిదా’

ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందంటే.. ఏ భావాన్నైనా ఇట్టే పలికించగలదు...పందొమ్మిదేళ్లకే కళ్లతో కుట్రలు పన్నే పడుచు అమ్మాయిగా నటించింది.

Updated : 27 Sep 2023 06:59 IST

ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందంటే.. ఏ భావాన్నైనా ఇట్టే పలికించగలదు...

పందొమ్మిదేళ్లకే కళ్లతో కుట్రలు పన్నే పడుచు అమ్మాయిగా నటించింది.

సమాజం అసహ్యించుకొనే వేశ్య పాత్రలో ఒదిగిపోయి.. వాళ్లకీ ఓ మనసుంటుందని ఒప్పించింది... ఆ కాలంలోనే ప్రియుడితో పారిపోయే ఆధునిక భావాలున్న యువతిగానూ మెప్పించింది...

ఒప్పుకున్న పాత్ర ఏదైనా.. నటనతో దాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లడం వహీదా రెహమాన్‌ తీరు.

అందుకే ఆ రోజుల్లో ఆమె నిర్మాతలకు తొలి ఛాయిస్‌. స్టార్‌ హీరోల కలల జోడీ. అభిమానుల హృదయాలు గెలిచిన సామ్రాజ్ఞి...

అందం, నటనా కౌశలంతో మేటిగా ఎదిగిన ఆమెను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ పురస్కారం వరించడం సినిమా అభిమానులకు ఆనందదాయకం.

భారతీయ సినీ చరిత్రలో వహీదా రెహమాన్‌ని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా పరిగణిస్తుంటారు. ఐదు దశాబ్దాల ఆమె సినీ జీవితంలో తొంభైకిపైగా సినిమాల్లో నటించారు. 1955లో ‘రోజులు మారాయి’తో ఆమె వెండితెర ప్రస్థానం మొదలైంది. ఆనాటి దిగ్దర్శకుడు, నటుడు గురుదత్‌తో కలిసి ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే ఫూల్‌’, ‘కాలా బాజార్‌’, ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’ లాంటి మరపురాని చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. 1965లో వచ్చిన రొమాంటిక్‌ డ్రామా ‘గైడ్‌’ ఆమె ప్రతిభకి ఓ మచ్చుతునక. ఆ నటనకే ఉత్తమ నటిగా తొలి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ‘నీల్‌కమల్‌’, ‘చౌదావీ కా చాంద్‌’, ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’, ‘సి.ఐ.డి.’, ‘ఖామోశీ’ చిత్రాల్లో నటనతో అందలానికి చేరారు. రొమాన్స్‌, సెంటిమెంట్‌, డ్రామా, హారర్‌.. ఎలాంటి భావోద్వేగాలనైనా అలవోకగా పలికించే వహీదా.. దిలీప్‌కుమార్‌, రాజేంద్రకుమార్‌, రాజ్‌కపూర్‌, రాజేశ్‌ ఖన్నా, దేవానంద్‌, సునీల్‌దత్‌, బిశ్వజిత్‌.. లాంటి అప్పటి స్టార్‌ హీరోలందరితో కలిసి పని చేశారు. ఆమె నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘బీస్‌ సాల్‌ బాద్‌’ 1962లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘తీస్రీ కసమ్‌’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘ఖామోశీ’ చిత్రంలో ప్రేమలో విఫలమై, చివరికి పిచ్చిదానిలా మారిన నర్సుగా తన నటన పతాకస్థాయిలో ఉందని అంతా మెచ్చుకున్నారు. ఆమె హిందీతోపాటు కొన్ని తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌రేతో ‘అభిజన్‌’లో కలిసి పని చేశారు. తర్వాత మరికొన్ని బెంగాలీ సినిమాల్లో నటించారు.

ప్రతిభకు తగ్గ గుర్తింపు

డెబ్బయో దశకం వరకు ఓ వెలుగు వెలిగిన వహీదా.. తర్వాత సహాయ పాత్రలకు మారారు. అందులోనూ తనదైన ముద్ర వేశారు. ‘కభీకభీ’, ‘త్రిశూల్‌’, ‘నమ్కీన్‌’, ‘నమక్‌ హలాల్‌’, ‘చాంద్‌నీ’ తదితర చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె సుదీర్ఘ ప్రస్థానికి గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైం అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. ఆమె అత్యుత్తమ నటనకి ఒక జాతీయ అవార్డుతోపాటు, మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. 1959 నుంచి 1964 వరకు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి వహీదానే.

80ల్లో తల్లి పాత్రలు

1980ల కాలానికి వచ్చేసరికి వహీదా రెహమాన్‌ తల్లి పాత్రలవైపు మరలారు. 1991లో ‘లమ్హే’ తర్వాత వహీదా కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత 2002లో ‘ఓమ్‌ జై జగదీష్‌’తో పునరాగమనం చేశారు. ఆ తర్వాత  ‘వాటర్‌’, ‘రంగ్‌ దే బసంతీ’, ‘15 పార్క్‌ అవెన్యూ’, ‘దిల్లీ 6’ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశారామె. 2021లో ‘స్కేటర్‌ గర్ల్‌’ సినిమాలో నటించారు వహీదా.


అనుకోకుండానే నటన వైపు..

గ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన వహీదా రెహమాన్‌ ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఈమె నలుగురు అమ్మాయిల్లో ఆఖరు. నలుగురు కూతుళ్లనీ చెన్నైలోని ఒక గురువు దగ్గర చేర్పించి, భరతనాట్యంలో శిక్షణనిప్పించారు తల్లిదండ్రులు. వహీదాకి చిన్నప్పట్నుంచీ వైద్యురాలు కావాలని ఉండేది. దురదృష్టవశాత్తు నాన్న ఆకస్మిక మరణం, తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఆ కలకు దూరమయ్యారు. కొన్నాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పదహారేళ్ల వయసులోనే కుటుంబ భారం మోయాలనుకున్నారు. నాట్యంలో ప్రావీణ్యం ఉండటంతో తేలిగ్గానే అవకాశాలు చేజిక్కించుకున్నారు. తల్లి అభీష్టానికి వ్యతిరేకంగా సినిమాల్లోకి వెళ్లినా.. చిన్న వయసులోనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారారు.


తెలుగుతో అనుబంధం

హిందీ చిత్రసీమనేలిన వహీదా రెహమాన్‌కి తెలుగు నేలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తండ్రి మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేస్తుండటంతో ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం కొన్నేళ్లపాటు విశాఖపట్నంలో ఉంది. వహీదా అక్కడే సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌లో చదువుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్థిరపడాలి అనుకుంటున్న సమయంలో.. గురువు, మార్గదర్శిలా భావించే గురుదత్‌ సలహాతో బొంబాయికి మకాం మార్చారు. తర్వాత భారతీయ సినిమా చరిత్రలో కొన్నేళ్లపాటు మకుటం లేని మహారాణిగా వెలుగొందారు.


గేదెను కారు ఢీకొట్టడంతో హిందీ అవకాశం

గురు దర్శకత్వంలో వహీదా ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే ఫూల్‌’, ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’ లాంటి గొప్ప చిత్రాలలో నటించారు. ఆ చరిత్రను సత్య సరన్‌ రాసిన ‘టెన్‌ ఇయర్స్‌ విత్‌ గురుదత్‌’ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు రచయిత అబ్రార్‌ అల్వీ.  తమిళంలో హిట్‌ అయిన ‘మిస్సమ్మ’(1955)ని హిందీలో రీమేక్‌ చేయాలని చూస్తున్న దత్‌, అల్వీ, వారి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ గురుస్వామితో కలిసి కారులో హైదరాబాద్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకోకుండా అల్వీ కారు రోడ్డుపై ఉన్న ఒక గేదెని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ధ్వంసమైన కారు కారణంగా ఆ ముగ్గురు రెండురోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. అలా ఒకరోజు సికింద్రాబాద్‌లోని ఓ డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీసులో కూర్చున్న దత్‌ దృష్టిని కారు దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోకి ప్రవేశిస్తున్న ఓ మహిళ ఆకర్షించింది. ‘ఆమె తెలుగు సినిమా ‘రోజులు మారాయి’లో డ్యాన్సర్‌. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది’ అని ఆ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పడంతో గురు ఆమెను ఆఫీసుకి పిలిపించారు. ఆమే వహీదా రెహమాన్‌. సాదాసీదా దుస్తులు ధరించి, ఎంతో సున్నితంగా మాట్లాడుతూ గురుని ఆకట్టుకుంది వహీదా. అలా తొలి హిందీ చిత్రం ‘సి.ఐ.డి.’లో అవకాశం దక్కించుకున్నారు వహీదా. దేవానంద్‌తో కలిసి తెరపై కనిపించడం అదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని