Deepika Padukone: గ్లోబల్‌స్టార్‌గా ఎదగాలంటే దేశాన్ని ఎందుకు విడిచి వెళ్లాలి?

గ్లామర్‌.. యాక్టింగ్‌.. యాక్షన్‌.. ప్రతి జానర్‌ని అవలీలగా పోషిస్తూ.. చేతినిండా సినిమాలతో దూసుకెళ్తోంది బాలీవుడ్‌ నాయిక దీపికా పదుకొణె.

Updated : 15 Nov 2023 09:17 IST

గ్లామర్‌.. యాక్టింగ్‌.. యాక్షన్‌.. ప్రతి జానర్‌ని అవలీలగా పోషిస్తూ.. చేతినిండా సినిమాలతో దూసుకెళ్తోంది బాలీవుడ్‌ నాయిక దీపికా పదుకొణె(Deepika Padukone). ‘కల్కి 2898 ఏడీ’, ‘ఫైటర్‌’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోన్న తను తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. పలు సినిమా, వ్యక్తిగత విషయాలు పంచుకుంది. ఆ విశేషాలివి.

  • మోడల్‌గా నా కెరీర్‌ మొదలు పెట్టా. అక్కడే మంచి పేరొచ్చింది. ఆ సమయంలో నా ఫ్యాషన్‌ గురూలంతా ‘నువ్వు ఇక్కడ ఉంటే ఎదగలేవు. ప్యారిస్‌, న్యూయార్క్‌, మిలన్‌ వెళ్లిపో. బాగా స్థిరపడతావు’ అన్నారు. నా దేశం ఇండియా. దీన్ని వదిలి నేనెందుకు వెళ్లాలి? అనుకునేదాన్ని. అయినా గ్లోబల్‌ స్టార్‌గా ఎదగాలంటే.. వేరే దేశానికి ఎందుకు వెళ్లాలనే సందేహం ఇప్పటికీ నాలో ఉంది.
  • మోడల్‌గా పలు అంతర్జాతీయ బ్రాండ్లకు పని చేశా. ప్రముఖ బ్రాండ్‌ లూయీస్‌ వ్యూటన్‌తో పని చేస్తున్నప్పుడు.. వాళ్ల ఉత్పత్తుల పక్కన నా చిన్నచిన్న ఫొటోలు పెట్టి సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉపయోగించుకునేవారు. వాళ్లలా నన్నొక ఇన్‌ఫ్లుయెన్సర్‌లా వాడుకోవడం చిన్నతనంగా అనిపించింది. తర్వాత కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీలో సభ్యురాలిగా ఫ్రాన్స్‌లో అడుగు పెట్టినప్పుడు నా నిలువెత్తు హోర్డింగ్‌లు పెట్టారు. అప్పుడే తొందరపాటు మంచిది కాదనిపించింది.
  • ముంబయికి వచ్చిన కొత్తలో నేను టీనేజర్‌ని. చాలా కష్టాలు ఎదుర్కొన్నా. నా తిండి నేనే సంపాదించుకోవాల్సిన పరిస్థితి. ఒంటరి ప్రయాణం.. వెంట బండెడు లగేజీ. అర్ధరాత్రుళ్ల దాకా పని చేసి అదే లగేజీతో క్యాబ్‌లలోనే నిద్రపోయేదాన్ని. ఇలాంటివి నేనెప్పుడూ భారంగా, కష్టంలా భావించలేదు. ఇవన్నీ మనకు మనం చేసుకోవాల్సిందే.
  • పదిహేను, ఇరవై ఏళ్ల కిందట సినిమాలు తప్ప నాకు మరో మార్గం లేదనుకున్నా. అప్పుడు అవకాశం దక్కించుకోవడం పెద్ద టాస్క్‌. ఎందుకంటే నా తల్లిదండ్రులు పరిశ్రమలో లేరు. నాకంటూ గాడ్‌ఫాదర్లు లేరు. సహజంగానే సినీ కుటుంబాల్లోని వారసులకే అవకాశాలు దక్కేవి. దీన్నే నెపోటిజం అంటున్నారిప్పుడు. అది అప్పుడు ఉంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన వాస్తవం ఇది.
  • నా మనసుకి ఏదైనా సబబు అనిపిస్తే.. నేను బలంగా నమ్మితే దానికి అండగా నిలబడతా. నేనెవరికీ భయపడను. దిల్లీ జేఎన్‌యూ విద్యార్థుల తరఫున అలాగే నిలబడ్డా. బెదిరింపులొచ్చాయి. లెక్క చేయలేదు. ఎందుకంటే నేను విలువలు, నిర్భీతి ఉన్న కుటుంబ వాతావరణంలో పెరిగాను. ఒకవేళ నేను చేసింది తప్పైతే దాన్ని సరిదిద్దుకోవడానికీ, సారీ చెప్పడానికీ సిగ్గు పడను.
  • రకరకాల కారణాలతో 2014లో తీవ్ర మానసిక కుంగుబాటుకి గురయ్యా. తర్వాత నా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా నా పనిగానే భావిస్తూ వస్తున్నా. ఆ సమయంలో తీరిక లేకుండా పని చేయడం నాకో మార్గంలా కనిపించింది. నన్ను నేను ఒక వర్క్‌హాలిక్‌గా చెప్పుకోవడానికి గర్వపడతా. కానీ పనిలో పడి సర్వం మర్చిపోయి, రకరకాల ఇబ్బందుల్లో పడేంతగా పని చేయను.

ప్రేమ పెరగడానికి షెడ్యూల్స్‌

‘‘నా భర్త రణ్‌వీర్‌తో సమయం గడపడం నాకు ముఖ్యమైన విషయం. కానీ మా వృత్తి కారణంగా షూటింగ్‌, ప్రయాణాలతో ఇద్దరం తీరిక లేకుండా ఉంటున్నాం. కొన్నిసార్లు తను ఏ అర్ధరాత్రో ఇంటికొస్తాడు. నేను తెల్లవారుజామునే వెళ్లిపోవాలి. అందుకే మా మధ్య ప్రేమ పెరగడానికి, కుటుంబాలతో గడపడానికి మాకంటూ ఓ షెడ్యూల్‌ పెట్టుకుంటున్నాం. నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. వారాంతాల్లో రణ్‌వీర్‌, నేను కలిసి మ్యూజిక్‌ వింటాం. కలిసి డ్యాన్స్‌ చేస్తాం. ఒక్కోసారి తెల్లవారేదాకా అది సాగుతుంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు