Tollywood: యువతారలదే ఈ వేసవి

నిజానికి వేసవి సీజన్‌ మొదలు కావడానికి ఇంకో నెలన్నర సమయం ఉన్నా.. ఇంత వరకు సినీ క్యాలెండర్‌లో బెర్తులేవీ పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. ప్రభాస్‌ ‘కల్కి 2898ఎ.డి’, విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్‌’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాల విడుదల తేదీలపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది.

Updated : 28 Jan 2024 12:02 IST

సంక్రాంతి చిత్రాలు చిత్రసీమకు నూతనోత్తేజాన్ని అందించాయి. ఇక ఇప్పుడు వేసవి సీజన్‌ వైపు దృష్టి సారించే సమయం ఆసన్నమైంది. సాధారణంగా వేసవి అనగానే అగ్రతారల సినిమాల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు సినీప్రియులు. కానీ, ఈసారి ఆ అగ్రతారల మెరుపులు అంతగా కనిపించకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. కొందరు ఇప్పటికీ కొత్త చిత్రాలు పట్టాలెక్కించకపోవడం.. మరికొందరు చిత్రీకరణలు ప్రారంభించినా ద్వితీయార్ధంలో బరిలో దిగేందుకు సిద్ధపడుతుండటం దీనికి కారణం. దీంతో ఈ సమ్మర్‌ సినీ మారథాన్‌లో సినీ ప్రియుల్ని వినోదాల జల్లుల్లో తడిపేందుకు యువ కథానాయకులు సిద్ధమవుతున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలతో మురిపించేందుకు సెట్స్‌పై చకచకా ముస్తాబవుతున్నారు.

నిజానికి వేసవి సీజన్‌ మొదలు కావడానికి ఇంకో నెలన్నర సమయం ఉన్నా.. ఇంత వరకు సినీ క్యాలెండర్‌లో బెర్తులేవీ పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. ప్రభాస్‌ ‘కల్కి 2898ఎ.డి’, విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్‌’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాల విడుదల తేదీలపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. అయితే మిగతా యువ హీరోల సినిమాల విడుదలలు ఎప్పుడన్నది ఇంకా తేలకున్నా .. వేసవి బరిలో నిలవడం పక్కా అనైతే సంకేతాలు అందుతున్నాయి. గతేడాది ‘స్కంద’తో సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు రామ్‌. ఇప్పుడాయన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో సెట్స్‌పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ వేసవిలోనే థియేటర్లలోకి రానుంది. దీనికి తగ్గట్లుగా ఇప్పటికే ఓవైపు చిత్రీకరణను పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు నిర్మాణానంతర పనుల్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. నిజానికి ఇది మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలోకి రానున్నట్లు ఇది వరకు ప్రకటించారు. కానీ, ఇప్పుడది ఏప్రిల్‌ లేదా మేలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో ముందుంటారు యువ హీరో శర్వానంద్‌. ఇప్పుడాయన శ్రీరామ్‌ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా విదేశాల నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇది సమ్మర్‌లోనే బరిలో దిగాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సమాయత్తమవుతున్నారు విష్వక్‌ సేన్‌. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నేహా శెట్టి కథానాయిక. పీరియాడిక్‌ టచ్‌తో సాగే యాక్షన్‌ డ్రామాలా ముస్తాబైన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీన్ని మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. ‘సామజవరగమన’తో గతేడాది ఓ చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన ‘రాజ రాజ చోర’ సీక్వెల్‌తో సెట్స్‌పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఇదీ వేసవి లక్ష్యంగానే సినీప్రియుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

సుధీర్‌బాబు కథానాయకుడిగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. 1980ల నాటి కుప్పం నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా మార్చి లేదా ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. అల్లరి నరేశ్‌ హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చిలక ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇదీ వేసవి కానుకగానే సినీప్రియుల ముందుకు రానుంది. దీంట్లో నరేశ్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించనుంది. ఐదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న నారా రోహిత్‌ ప్రస్తుతం ‘ప్రతినిధి 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో చక్కటి విజయాన్ని అందుకున్న ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందుతోన్న చిత్రమిది. మూర్తి దేవగుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఇది సమ్మర్‌ బరిలోనే థియేటర్లలోకి రానుంది.


‘దేవర’ వచ్చేనా?

ఏప్రిల్‌ బరిలో సందడి చేయాల్సిన ఎన్టీఆర్‌ ‘దేవర’ వాయిదా పడనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడదే తేదీకి ‘ఫ్యామిలీస్టార్‌’ రానున్నట్లు సమాచారం అందడంతో వాయిదా వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ‘దేవర’ రాక ఆలస్యమైనా.. వేసవి బరిలో కనిపిస్తాడా? లేక ద్వితీయార్ధానికి వెళ్లిపోతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు