Ruslaan: ‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది

‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్‌ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’

Updated : 20 Apr 2024 12:10 IST

‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్‌ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ అన్నారు నిర్మాత కె.కె.రాధామోహన్‌. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆయన హిందీలో చేసిన తొలి చిత్రం ‘రుస్లాన్‌’. ఆయుష్‌శర్మ కథానాయకుడు. సుశ్రీ మిశ్రా కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్‌.బి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో ఓ వేడుకని నిర్వహించారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టీజర్‌ని చాలాసార్లు చూశా. చూసిన ప్రతిసారీ కొత్త కోణం కనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్‌తో సినిమా జరుగుతున్నప్పుడు సెట్లో ఆయుష్‌ని చూశా. దర్శకత్వ శాఖలో పనిచేసేవారు. అప్పుడే ఓ హీరోలా కనిపించాడు. ఇందులో చాలా బాగా నటించాడు. తనకి మంచి భవిష్యత్తు ఉంది. రాధామోహన్‌ తపన ఉన్న నిర్మాత. ఈ సినిమాని అద్భుతంగా నిర్మించారు. జగపతిబాబు ఇందులో కనిపించిన విధానం మరింత ప్రత్యేకం’’ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చాలా ప్రత్యేకం. అన్ని పాత్రలకీ ప్రాధాన్యం ఉంది. నేను భిన్న కోణాలున్న పాత్ర చేశా. హిందీలో నాకు ఇది రెండో చిత్రం. చాలా రోజుల తర్వాత భిన్నమైన పాత్రనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

కథానాయకుడు ఆయుష్‌ శర్మ మాట్లాడుతూ ‘‘విజయేంద్రప్రసాద్‌ సర్‌ నన్ను ‘సుల్తాన్‌’ సెట్‌లో చూశారు. ఆయనే నన్ను నటుడిగా పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పారు. అలా మొదలైంది నా ప్రయాణం. కె.కె.రాధామోహన్‌ తపన ఉన్న నిర్మాత. ఎంతో అంకిత భావంతో ఈ సినిమాని నిర్మించారు. ఇదొక మంచి అనుభూతిని పంచే చిత్రం అవుతుంది. ప్రేక్షకులు  కచ్చితంగా ఆస్వాదిస్తార’’న్నారు. నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ‘‘భావోద్వేగాలు, యాక్షన్‌, మంచి సంభాషణలు, అందమైన విజువల్స్‌ ఉన్న చిత్రమిది. గొప్ప అనుభూతిని పంచేలా చిత్రాన్ని తీశాం. హిందీలో నా రెండో చిత్రం కోసం రచయిత  విజయేంద్రప్రసాద్‌  కథ సిద్ధం చేశారు. అది తెలుగులో ‘విక్రమార్కుడు2’గా, హిందీలో ‘రౌడీరాథోడ్‌2’గా తెరకెక్కుతుంది. ఆయన సల్మాన్‌ ఖాన్‌ కోసం ‘బజరంగీ భాయ్‌జాన్‌2’ కథని కూడా సిద్ధం చేసి, సల్మాన్‌ఖాన్‌కి వినిపించేందుకు సిద్ధంగా ఉన్నార’’ని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని