మా సినిమా స్నేహాన్ని పెంచుతుంది: చిరంజీవి

 రాజకీయం శత్రువులను పెంచితే,  సినిమా స్నేహితుల్నీ, స్నేహాన్ని పెంచుతుందన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి

Updated : 06 Jan 2020 09:43 IST

హైదరాబాద్‌: రాజకీయం శత్రువులను పెంచితే,  సినిమా స్నేహితుల్నీ, స్నేహాన్ని పెంచుతుందన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ చిత్ర మెగా సూపర్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా విజయశాంతితో కలిసి వేదికపై ఆయన మాట్లాడారు. 

‘‘వారి అభిమానులు.. వీరి అభిమానులు అని కాకుండా అందరూ కలిసి ఐకమత్యంతో ఉండటం కావాలి. ‘సరిలేరు నీకెవ్వరు’తో మీరు ఆ కలను నిజం చేశారు. మహేశ్‌బాబు చాలా అందంగా ఉంటారు. ఆ అందం వెనుక చిలిపితనం కూడా ఉంటుంది. ఈ మధ్య కొన్ని నెలల క్రితం పేపర్‌ తిరగేస్తుంటే మహేశ్‌ ఫొటో కనిపించింది. చూడగానే కత్తిలా ఉంది. ఆ లుక్‌ నన్ను కట్టిపడేసింది. వెంటనే మహేశ్‌బాబుకు ఎస్‌ఎంఎస్‌ చేశా. అలా జరిగిందో లేదో ఇంతలోనే సినిమా అయిపోయిందన్నారు. నేడు ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా తీయడానికి ఏడాదిపైనే అవుతోంది. కానీ, ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో తీశారు. ఇండస్ట్రీకి ఇదే కావాలి. సినిమా పూర్తయ్యే వరకూ మహేశ్‌ ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిసింది. ఇది ఆరోగ్యకర సంప్రదాయం. నేనెప్పుడూ నా సినిమాలకు అడ్వాన్స్‌ తీసుకోను. ఎందుకంటే నిర్మాతలకు కలిసి వస్తుంది. అదే రామ్‌చరణ్‌ కూడా ఫాలో అవుతున్నాడు. నిర్మాతకు వెన్నుదన్నుగా నిలబడటం సంతోషంగా ఉంది. ఇదే విషయాన్ని మా దర్శకుడు కొరటాలతో అంటే ఆయన కూడా ‘మీతో సినిమా 80-85రోజులకు మించదు’ అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెబుతున్నా. సినిమా త్వరగా పూర్తయ్యేలా ఆరోగ్యకర వాతావరణం వస్తుందని నేను అనుకుంటున్నా. దీనికి మహేశ్‌ ముందడుగు వేయడం సంతోషం.

‘‘సీనియర్‌ మోస్ట్‌ నటుడైన కృష్ణగారికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేసి ఆయన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు సిఫార్సు చేస్తే అది మన తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. ఆయన చేసినన్ని ప్రయోగాలు మరో నటుడు చేయలేదు. దిల్‌రాజు సినిమా అంటే తప్పకుండా విజయం శాతం ఎక్కువ. రష్మిక, తమన్నా చాలా చక్కగా చేశారు.  నటి సంగీత అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తుంది’’

‘‘సండే అననురా.. మండే అననురా.. ఎన్నడూ నీదానరా..’ అంటూ పాట పాడిన విజయశాంతి నన్ను వదిలేసి 15ఏళ్లు దాటి పోయింది. ఇన్నేళ్లకు మళ్లీ కలవడం ఆనందంగా ఉంది. ‘నా కన్నా ముందే రాజకీయాల్లోకి వెళ్లావు కదా! నన్ను ఎలా తిట్టావు విజయశాంతి..’ (మధ్యలో విజయశాంతి అందుకుని, రాజకీయం వేరు.. సినిమాలు వేరు.. నవ్వులు) 15ఏళ్లు అయినా, అదే సొగసు, అదే పొగరు.. అదే అందం.. మళ్లీ మనం కలిసి నటిస్తామేమో. రాజకీయం శత్రువులను పెంచుతుంది. సినిమా స్నేహాన్ని పెంచుతుంది. తన మీద ఉన్న ప్రేమ, మమకారం వల్ల ఎప్పుడూ తనని ఒక్క మాట కూడా అనలేదు. (మధ్యలో విజయశాంతి అందుకుని.. మీ మీద ఎప్పటికీ గౌరవం ఉంది. ప్రజల కోసమే నా పోరాటం.) ఇన్నేళ్ల తర్వాత మహేశ్‌ సినిమా వల్ల మేము కలిసి మాట్లాడే అవకాశం లభించింది. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు. 

మాస్‌ సినిమా చేసి చాలా రోజులైంది: మహేశ్‌బాబు

‘‘ఈ రోజు ఒక మిరాకల్‌ అని చెప్పవచ్చు. ఉదయం మా దర్శకుడికి అబ్బాయి పుట్టాడు. దిల్‌రాజు గారి ఇంటికి ఒక పాప వచ్చింది. ‘ఒక్కడు’ చూసి చిరంజీవిగారు నన్ను అభినందించారు. ‘అర్జున్’ సినిమా చేస్తున్నప్పుడు సెట్‌కు వచ్చి, ‘నీలాంటి వాళ్లు ఇండస్ట్రీకి కావాలి’ అన్నారు. అలాగే ‘పోకిరి’లో నా నటన చూసి చాలా మెచ్చుకున్నారు. ప్రతి సినిమాకు ఆయన నుంచి ఫోన్‌ వస్తుంది. ఈ సినిమాకు కూడా మీదే మొదటి ఫోన్‌ కావాలని కోరుకుంటున్నా. విజయశాంతిగారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. మేము ఆమెకు అవకాశం ఇవ్వలేదు. మాకే ఆమె అవకాశం ఇచ్చారు. మా సినిమా చేయడానికి ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు. భారతి పాత్ర మీరు తప్ప వేరే వాళ్లు చేయలేరు. చాలా మందితో పనిచేశాను కానీ, ఒక దర్శకుడు పాజిటివ్‌ ఎనర్జీ నాకు అనిల్‌ రావిపూడిలో కనిపించింది. ఇంత త్వరగా నేనెప్పుడూ సినిమా పూర్తి చేయలేదు. నేను ఒక మాస్‌ సినిమా చేసి చాలా రోజులైంది. నేనెప్పుడైనా కథ నచ్చితేనే చేస్తా. ఇప్పుడు కూడా అనిల్‌ కథ నచ్చడంతోనే చేశా. తమన్నా, రష్మిక చాలా బాగా చేశారు. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అభిమానులు లభిస్తారు. జనవరి 11న మీకో కానుక ఇవ్వబోతున్నాం. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ కావాలి. చివరిగా చిరంజీవిగారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు’’ అని మహేశ్‌బాబు అన్నారు.

తండ్రితో ఇండస్ట్రీకి పరిచయం అయ్యా.. కొడుకుతో రీఎంట్రీ ఇచ్చా.

విజయశాంతి మాట్లాడుతూ... ‘‘1979 నుంచి 2020 వరకూ సుదీర్ఘ ప్రయాణం. మీతో నడిచాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ అన్ని రకాల సినిమాలు చేశా. చిరంజీవిగారితో కూడా పలు సినిమాలు చేశా. అమ్మాయిల కోసం ‘నేను ఉన్నాను’ అనే ప్రోత్సహాన్ని ఇచ్చేందుకు నేను మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశా. చిన్నప్పుడు మహేశ్‌బాబును చూస్తుంటే చాలా క్యూట్‌గా ఉండేవారు. కృష్ణగారి దర్శకత్వంలో ఆ సినిమా చేశా. మళ్లీ ఇన్నేళ్లకు మహేశ్‌తో సినిమా చేశా. కృష్ణగారే నన్ను హీరోయిన్‌గా పరిచయం చేశారు. రీఎంట్రీ మహేశ్‌బాబుగారితో అవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మహేశ్‌ 24 క్యారెట్ల బంగారం. జెంటిల్‌మెన్‌. ‘సూపర్‌స్టార్‌’ అన్న పదానికి అర్థం మహేశ్‌బాబుగారు. అంచెలంచెలుగా ఎదగడం.. ఒదగడంలో మహేశ్‌బాబును మించిన వారు ఎవరూ లేరు. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్‌ సూపర్‌. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు మీరు తెరపైనే చూడాలి. మహేశ్‌ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయా. ఆయన నిజంగా బయట కూడా సూపర్‌స్టార్‌. అనిల్‌ రావిపూడి కామెడీ టేకింగ్‌ చాలా బాగుంటుంది. ఇదొక కొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంది. నాతో పట్టుబట్టి ఈ సినిమా చేయించారు. ఈ పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నా. మీరు తోడుంటే మరిన్ని సినిమాలు చేస్తా. ఇన్నేళ్ల తర్వాత చిరంజీవిని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు