‘డార్లింగ్‌’ మూవీ కోసం రిస్క్‌ చేసిన కరుణాకరన్‌

‘డార్లింగ్‌’ ఈ పేరు వినగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్‌. తనతో స్నేహం చేసే ప్రతి ఒక్కరినీ ‘డార్లింగ్‌’ అంటూ పిలవడం ఆయనకు అలవాటన్నది

Updated : 23 Apr 2020 14:12 IST

‘డార్లింగ్‌’ ఈ పేరు వినగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్‌. తనతో స్నేహం చేసే ప్రతి ఒక్కరినీ ‘డార్లింగ్‌’ అంటూ పిలవడం ఆయనకు అలవాటు. అలా ఆ పేరుతోనే సినిమా తీసి, స్నేహితులతోనే కాదు, యావత్‌ తెలుగు సినీ ప్రేక్షకులతో ‘డార్లింగ్‌’ అనిపించుకున్నారు ప్రభాస్‌. కరుణాకరణ్‌ దర్శకత్వంలో వచ్చి ఈ చిత్రం విడుదలై నేటికి 10ఏళ్లు పూర్తి చేసుకుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 2010 23 ఏప్రిల్‌న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి హృదయాలను గెలుచుకుని, బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 

కథేంటంటే: 1980 ఫ్లాష్‌ బ్యాక్‌తో సినిమా మొదలవుతుంది. కొందరు కళాశాల మిత్రులు ఫేర్‌వెల్‌ అయిపోయిన తర్వాత ఎప్పటికీ ఇలా కలుస్తూనే ఉండాలని అనుకుని వెళ్లిపోతారు. ఆ స్నేహితుల్లో హనుమంతరావు (ప్రభు) కొడుకు ప్రభాస్‌ (ప్రభాస్/ప్రభ‌), విశ్వనాథ్‌(ఆహుతి ప్రసాద్‌) కుమార్తె నందిని (కాజల్‌ అగర్వాల్)‌. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పెరిగి పెద్దవాళ్లవుతారు. కాలేజ్‌లో ప్రభాస్‌ను చూసి నిషా (శ్రద్ధాదాస్‌) అతన్ని ప్రేమిస్తుంది. ప్రభాస్‌ కాదనడంతో ఆత్మహత్యయత్నం చేస్తుంది. ఈ విషయం నిషా తండ్రి (ముకేశ్‌ రుషి)కి తెలిసి ఎలాగైనా ప్రభాస్‌ను తీసుకొచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. తన మనుషుల్ని పంపి ప్రభాస్‌ స్నేహితులను బంధించి ‘నువ్వు రాకపోతే నీ వాళ్లను చంపేస్తా’ అని బెదిరిస్తాడు. స్నేహితులను కాపాడుకునేందుకు వచ్చిన ప్రభ ఏం చేశాడు? నిషాను పెళ్లి చేసుకున్నాడా? నందినిని ఎలా కలుసుకున్నాడు? అన్నదే కథ. 

సరదాగా సాగిపోతూ..

ప్రభాస్‌ నుంచి ప్రేక్షకులు మాస్‌ సినిమానే ఆశిస్తారు. కానీ, ‘డార్లింగ్‌’లాంటి లవ్‌ ఎంటర్‌టైనర్‌తోనూ మెప్పించగలనని నిరూపించారాయన. ఎందుకంటే ఈ సినిమాకన్నా ముందు ఆయన నటించిన సినిమాలన్నీ ఆ కోవకు చెందినవే. ప్రథమార్ధమంతా సరదాగా సాగిపోతుంది. స్నేహితులను కాపాడుకునేందుకు నిషా తండ్రికి తన ప్రేమ కథను చెబుతాడు ప్రభాస్‌. తన స్నేహితులతో స్విట్జర్లాండ్‌ వెళ్లడం, అక్కడ నందిని చూసి ప్రేమించడం, ప్రభాస్‌, నందినిల మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ అంతా హాయిగా గడిచిపోతుంది. ఇంటర్వెల్‌ సమయానికి ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. అదంతా అబద్ధమని చెప్పడంతో థియేటర్‌లోని ప్రేక్షకుడు షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి అతడి స్నేహితుల రీయూనియన్‌ కార్యక్రమానికి అరకు వెళతాడు. స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన అక్కడకు నందిని ప్రేమను పొందడానికి ప్రభాస్‌ చేసే ప్రయత్నాలు కూడా నవ్వు పుట్టిస్తాయి. అయితే, చివర్లో దర్శకుడు ఇచ్చిన మరో ట్విస్ట్‌ ఆశ్చర్యపరుస్తుంది. విశ్వనాథ్‌, అతడి తండ్రి (కోట శ్రీనివాసరావు) మేనల్లుడైన రిషిని అప్పల్రాజు కొడుకుగా పరిచయం చేసి అతడితో నందని పెళ్లి చేయాలని అనుకుంటారు. చివరకు నందిని తన ప్రేమను ప్రభాస్‌కు చెప్పడం, ప్రభాస్‌ చెప్పిందంతా అబద్ధమని నిషా తండ్రికి తెలిసి దాడి చేయడానికి రావడంతో చివరిలో ప్రభాస్‌-నందినిల ప్రేమ తెలుసుకుని వెళ్లిపోవడంతో కథ సుఖాంతం అవుతుంది. 

రిస్క్‌ చేసిన కరుణాకరన్‌

‘తొలిప్రేమ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కరుణాకరన్‌. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తే. పైగా ప్రభాస్‌ కథానాయకుడు కావడంతో అది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ‘డార్లింగ్‌’ సినిమా కోసం దర్శకుడు కరుణాకరన్‌ రిస్క్‌ చేశారు. ఎలా అంటే, ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే కాస్త భిన్నంగా ఉంటుంది. స్విట్జర్లాండ్‌లో నందినితో ప్రేమ కథ అంతా అబద్ధమని తెలిసిన తర్వాత థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో దర్శకుడు చీట్‌ చేశాడని అనిపిస్తుంది. దీనిపై ఒకానొక సందర్భంలో కరుణాకరన్‌ మాట్లాడుతూ..‘నేనెప్పుడూ కొత్త జానర్‌లో స్టోరీ నరేట్‌ చేయడానికే ప్రయత్నిస్తా. రొటీన్‌గా నేరుగా స్టోరీ చెప్పడం ఒకటి. కానీ, ఏదో ట్విస్ట్‌ ఉండాలి. ఒక అమ్మాయి.. అబ్బాయి.. ఒకరినొకరు ప్రపోజ్‌ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రేమించుకుంటారు. ఇది ఎవరైనా తీస్తారు. అందుకే నేను ఏ విధంగా కొత్తగా చెప్పాలన్నది ప్రయత్నించా. నిజం చెప్పాలంటే ‘డార్లింగ్‌’ సినిమా రిస్క్‌ చేశా. ఫస్టాప్‌ అబద్ధమని తెలిసిన తర్వాత నన్ను చాలా మంది తిట్టారు. కానీ, ప్రభాస్‌-కాజల్‌ నటన, కామెడీ టైమింగ్‌ సినిమాను నిలిపాయి’’ అని చెప్పుకొచ్చారు. 

అలరించిన జీవీ ప్రకాశ్‌ సంగీతం

ఈ సినిమాకు మరో హైలైట్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అందించిన సంగీతం. ‘నీవే నీవే..’ ‘ఇంకా ఏదో’ పాటలు, వాటి పిక్చరైజేషన్‌ యువ హృదయాలను మెప్పిస్తాయి. మరీ ముఖ్యంగా ‘ఇంకా ఏదో’ పాటలో గోల్కొండ కోట, చార్మినార్‌లపై మంచు కురవడం, హుస్సేన్‌సాగర్‌ మొత్తం గడ్డకట్టి మంచుతో నిండిపోవడం భలే సరదాగా అనిపిస్తాయి. ఇక సినిమాలో చెప్పుకోవాల్సినవి పీటర్‌ హెయిన్స్‌ ఫైట్స్‌. భారీ ఫైట్స్‌ లేకపోయినా ప్రభాస్‌ అభిమానులను మెప్పిస్తాయి. 

స్వామి.. ‘డార్లింగ్‌ స్వామి’ అయిపోయారు

ఈ చిత్రానికి మాటలు రాసిన రచయిత స్వామి ‘డార్లింగ్‌’ స్వామి అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్‌ ‘రెబల్‌’కు డైలాగ్‌లు రాశారు. అప్పుడు తెరపై స్వామి పేరు వేయాల్సి రాగా, దర్శకుడు లారెన్స్‌ పిలిచి, ‘ఆ సినిమా మంచి హిట్టయింది కదా! అందుకే ఇక నుంచి మీ స్క్రీన్‌ నేమ్‌ ‘డార్లింగ్‌ స్వామి’ అని పెట్టుకోండి. ఈ సినిమాకు కూడా అలాగే వేద్దాం’ అని అన్నారట. దాంతో రచయిత స్వామి, డార్లింగ్‌ స్వామి అయిపోయారు. 

ఇక్కడే కాదు.. హిందీలోనూ ఆదరణ

ఈ సినిమాను కన్నడ, ఉర్దూ భాషల్లో రీమేక్‌ చేశారు. హిందీలో ‘సబ్సే బద్కర్‌ హమ్‌’ పేరుతో డబ్బింగ్‌ చేసి యూట్యూబ్‌లో విడుదల చేయగా, 15మిలియన్‌ వ్యూస్‌కుపైగా సాధించింది.  ఇక అవార్డుల విషయానికొస్తే, ఉత్తమ ఎడిటర్‌, ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కేటగిరిలో నంది అవార్డులను సొంతం చేసుకోగా, ఉత్తమ నటుడిగా  సినిమా మా జ్యూరీ అవార్డును ప్రభాస్‌ అందుకున్నారు. ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ఆండ్ర్యూ సంతోషం ఫిల్మ్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని