భానుమతి జుట్టుతో వచ్చింది చిక్కు..!

తెలుగు చిత్ర పరిశ్రమ అందించిన మణి రత్నాల్లాంటి చిత్రాల్లో ‘మల్లీశ్వరి’ ఒకటి. ఆ సినిమాలోని ఒక దృశ్యంలో భానుమతి హెయిర్‌ స్టైల్‌ మార్చుకుని వచ్చారట.

Published : 02 Jul 2023 14:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమ అందించిన మణి రత్నాల్లాంటి చిత్రాల్లో ‘మల్లీశ్వరి’ ఒకటి. ఆ సినిమాలోని ఒక దృశ్యంలో భానుమతి హెయిర్‌ స్టైల్‌ మార్చుకుని వచ్చారట. ఆ సినిమాకు దర్శకుడైన బి.ఎన్‌.రెడ్డి అది చూసి, ‘‘ముందు దృశ్యంలో హెయిర్‌ స్టైల్‌ ఎలా ఉందో ఇదీ అలాగే ఉండాలి. మార్చుకుంటే ఎలా?’’ అని కేకలు వేశారు. సెట్లో అందరి ముందూ ఆయన అలా కోప్పడటం చూసి, భానుమతి అలక వహించి మేకప్‌రూమ్‌కి వెళ్లిపోయారు. షూటింగ్‌ ఆగిపోయింది. పిలిస్తే ఆవిడ రావడం లేదు. హెయిర్‌ స్టైల్‌ ముందు దృశ్యంలో ఉన్నట్టుగానే, మార్చుకుని రమ్మంటున్నారని సహాయకులు చెప్పినా, భానుమతి వినలేదు. ఆవిడ అక్కడ అలక.. ఈయన ఇక్కడ ఆగ్రహం!

ఇలా అయితే సినిమా ఎలా పూర్తవుతుంది? ఇంత డబ్బు ఖర్చు చేసి, కళాఖండం తియ్యాలని తాపత్రయపడుతుంటే, భానుమతి తను తప్పు చేసి అలగడం ఏమిటి? ఇంక లాభం లేదని, పడుతున్న శ్రమంతా బూడిదపాలైపోతోందని, తానే రాజీ పడ్డారు బి.ఎన్‌.రెడ్డి. భానుమతిని, ముందు సీనులో ఉన్నట్టుగానే హెయిర్‌ స్టైల్‌ చేసుకుని మర్నాడు రమ్మని మేనేజర్‌తో కబురు పంపారు. తానూ వెళ్లి చెప్పారు. అలా ఆ రోజు షూటింగ్‌ ఆగిపోయింది.

‘‘ఇలాంటి అవస్థలు రాజేశ్వరరావుతో కూడా పడ్డాను. ఏదైనా చెబితే అలిగి వెళ్లిపోయేవాడు. అయినా, నా సినిమాకి అతనే కావాలి. అద్భుతమైన సంగీతం చేస్తాడు. నేను రాజీపడాలి. తప్పదు. నేను రాజేశ్వరరావు ఇంటికి వెళ్లి మంచిగా మాట్లాడి తీసుకొచ్చేవాడిని. ఈ సినిమాకు పనిచేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సాలూరి రాజేశ్వరరావు, భానుమతి వీళ్లు ముగ్గురూ మహానుభావులే. కానీ, అవస్థలు పెట్టేవారు. వీళ్లతో ‘మల్లీశ్వరి’ ఎలా తీశానో నాకే ఆశ్చర్యం వేస్తుంది’’ అని అంటుండేవారు బి.ఎన్‌.రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని