Hrithik Roshan: హృతిక్‌ రోషన్‌కు గాయం.. ఫొటో షేర్‌ చేసిన హీరో

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ గాయపడ్డారు. 

Published : 15 Feb 2024 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) కాలికి గాయమైంది. ఆ విషయాన్ని తానే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో ఆయన నడుముకి బెల్ట్‌ పెట్టుకుని, క్రచస్‌ (ఊతకర్ర) సపోర్ట్‌తో నిల్చొని కనిపించారు. ‘మీలో ఎంత మందికి క్రచస్‌ , వీల్‌ఛైర్‌ అవసరం వచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి?’ అంటూ పోస్ట్‌ పెట్టారు. తనని తాను మోటివేట్ చేసుకుంటూ దాన్నుంచి కోలుకుంటున్నానని తెలిపారు. టైగర్ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, వాణీ కపూర్‌ తదితర సినీ ప్రముఖలతోపాటు అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొన్ని రోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారని, ఈ మేరకు ‘వార్‌ 2’ (War 2)కు సినిమా చిత్రీకరణ వాయిదా పడే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.

దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ (NTR) కూడా నటించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడడమే ఆలస్యం అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నెగెటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌లో నటిస్తారని సమాచారం. వచ్చే ఏడాదిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ‘ఫైటర్‌’ (Fighter)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హృతిక్‌ విజయాన్ని అందుకున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా రూ. 330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని