Nagarjuna: సినిమా పరిశ్రమకి రాజధానిలా హైదరాబాద్‌

‘‘1976లో మేం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ని ప్రారంభించాం. అప్పటికి ఇక్కడ చిత్ర పరిశ్రమ లేదు, సాంకేతిక నిపుణులు లేరు, సినిమాకి సంబంధించిన ఏ విభాగం లేదు.

Updated : 01 Nov 2023 14:45 IST

‘‘1976లో మేం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ని ప్రారంభించాం. అప్పటికి ఇక్కడ చిత్ర పరిశ్రమ లేదు, సాంకేతిక నిపుణులు లేరు, సినిమాకి సంబంధించిన ఏ విభాగం లేదు. అలాంటి దశ నుంచి మొదలైన ప్రయాణం ఇక్కడివరకూ వచ్చింది. సాంకేతికంగా రోజు రోజుకీ గొప్ప మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్‌ సినిమా పరిశ్రమకి రాజధానిలా మారుతోంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సినిమాటిక్‌ ఎక్స్‌పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ, వినోద రంగంలోని సరికొత్త సాంకేతికతని పరిచయం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇండియా జాయ్‌, ఫ్లయింగ్‌ మౌంటెయిన్‌ కాన్సెప్ట్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగార్జున మాట్లాడారు. ‘‘తెలుగువాళ్లకి సినిమాలంటే ప్రాణం. ఓ సినిమాకి భారతదేశం మొత్తం వచ్చిన వసూళ్లు ఓ ఎత్తు, తెలుగు రాష్ట్రాల వసూళ్లు మరో ఎత్తు. దక్షిణాది సినిమాల్ని భారతదేశం మొత్తం అనుసరిస్తుండడం గర్వపడే విషయం. నాగ్‌ అశ్విన్‌లాంటి దర్శకులు తమ ప్రతిభని ప్రపంచానికి చూపిస్తున్నారు. తెలుగు నుంచి ఆస్కార్స్‌కి వెళ్లాం. ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌లని అభినందిస్తున్నా. చిత్ర పరిశ్రమ, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, యానిమేషన్‌ తదితర రంగాలకి చెందినవాళ్లకి ఇండియా జాయ్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తం’’ అన్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘‘హాలీవుడ్‌ సినిమాల్లా అంత నాణ్యతతో సినిమాలు ఎందుకు చేయరనే ప్రశ్న మాకు తరచూ ఎదురయ్యేది. గత పదేళ్లుగా మనం కూడా గొప్ప నాణ్యతతో సినిమాలు తీస్తున్నాం. హాలీవుడ్‌వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ‘కల్కి 2898 ఎ.డి’ని పూర్తిగా మన సాంకేతికతతోనే భారత్‌లో తయారైన సినిమాలా చేద్దామని ప్రయత్నించా. చాలా వరకు ఇక్కడే ఆ సినిమా పనులు జరుగుతున్నాయి. నా తదుపరి సినిమాని మాత్రం వందశాతం ఇక్కడి సాంకేతికతతోనే తెరకెక్కిస్తా’’ అన్నారు. ‘‘2016లో తీసుకొచ్చిన పాలసీతో యానిమేషన్‌, గేమింగ్‌ పరిశ్రమల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాం. భవిష్యత్తులో మరిన్ని రాయితీలతో ఈ రంగాల్ని ప్రోత్సహిస్తాం’’ అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కె.కె.సెంథిల్‌కుమార్‌, పి.జి.విందాతోపాటు వివిధ సంస్థల ప్రతినిధులు బిరేన్‌ గోస్‌, మైక్‌, ఆశిష్‌ కులకర్ణి, సరస్వతి వాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు