Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్‌ దర్శకుడి రియాక్షన్‌

‘యానిమల్‌’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన్ను ఉద్దేశించి బాలీవుడ్‌ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 17 Mar 2024 15:46 IST

ముంబయి: ‘యానిమల్‌’ విషయంలో చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, బాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు, రచయిత జావేద్‌ అక్తర్‌ మధ్య కొన్నిరోజులుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా జావేద్‌ స్పందించారు. తాను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఒక్క అసభ్య సన్నివేశం కూడా సందీప్‌కు కనిపించలేదన్నారు.

‘‘ఆ చిత్ర దర్శకుడిని నేను ఏమాత్రం విమర్శించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన చిత్రాన్ని తెరకెక్కించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఒక్కటి కాకపోతే మరో రెండు మూడు ‘యానిమల్‌’ చిత్రాలు చిత్రీకరించమనండి. నా బాధంతా ప్రేక్షకుల గురించే. నేను చేసిన వ్యాఖ్యలపై అతడు స్పందించినందుకు ధన్యవాదాలు. 53 ఏళ్ల నా సినీ కెరీర్‌లో ఆయనకు ఎక్కడా అసభ్య సన్నివేశాలు, మాటలు కనిపించలేదు. అందుకే ఆయన నా తనయుడు ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించిన ‘మిర్జాపూర్‌’ను ఉదాహరణగా చూపించారు. అందులో ఫర్హాన్‌ యాక్ట్‌ చేయలేదు. దానికి దర్శకత్వం వహించలేదు. వేరే వాళ్లతో కలిసి నిర్మించాడంతే’’ అని చెప్పారు.

జావేద్‌-సందీప్‌ మధ్య ఏం జరిగిందంటే: ‘యానిమల్‌’ విడుదలైన తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న జావేద్‌ అక్తర్‌ ఆ చిత్రాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఏం సందేశాలు ఇస్తున్నాయన్నారు. స్త్రీని తక్కువ చేసి చూపించే చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకోవడం నిజంగా ప్రమాదకరమన్నారు. దీనిపై సందీప్‌ స్పందిస్తూ.. ‘‘మిర్జాపూర్‌’ నిర్మించిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన తన తనయుడు ఫర్హాన్‌ అక్తర్‌కు ఎందుకు చెప్పలేదు. ఆ సిరీస్‌లో చాలా అసభ్య పదాలు ఉంటాయి. ఇప్పటివరకూ నేను దాన్ని చూడలేదు. మా సినిమాలపై వ్యాఖ్యలు చేసే ఆయన తన కుమారుడి వర్క్‌ను ఎందుకు చెక్‌ చేయడం లేదు’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని