Guntur Kaaram: ఎవరి బాధలకు ఆడే లిరిక్‌ రైటరు

ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ రూపొందించిన సంగతి తెలిసిందే.

Updated : 31 Dec 2023 12:13 IST

సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ రూపొందించిన సంగతి తెలిసిందే. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఈ క్రమంలోనే శనివారం ఈ చిత్రం నుంచి ‘‘కుర్చీ మడతపెట్టి’’ అనే లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఓ హుక్‌ లైన్‌తో తమన్‌ ఈ మాస్‌ పాటను సిద్ధం చేశారు. దీనికి తగ్గట్లుగానే రచయిత రామజోగయ్య శాస్త్రి మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించేలా సాహిత్యమందించారు. ‘‘రాజమండ్రి రాగ మంజరి.. మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి. కళాకార్ల ఫ్యామిలీ మరి.. నేను గజ్జ కడితే నిదురపోదు నిండురాతిరి’’ అంటూ ఈ పాట హుషారుగా సాగింది. పాట ఆఖర్లో ‘‘ఏంది అట్టా చూస్తున్నా.. ఇక్కడ ఎవరి బాధలకి ఆడే లిరిక్‌ రైటరు.. మడతపెట్టి పాడేయండి’’ అంటూ మహేశ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గీతాన్ని సాహితి చాగంటి, శ్రీకృష్ణ సంయుక్తంగా ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా మాస్‌ యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమాకి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు