Cinema News: ఈనాడు సినిమా ముచ్చట్లు..!

వైష్ణవి ఫిలింస్‌ పతాకంపై నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్‌.ఎస్‌.అరుణాచలం దర్శకుడు.

Updated : 07 Nov 2022 08:10 IST

నాగశౌర్య చిత్రం ప్రారంభం

వైష్ణవి ఫిలింస్‌ పతాకంపై నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్‌.ఎస్‌.అరుణాచలం దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్‌కుమార్‌, డా.అశోక్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. బేబి అద్వైత, భవిష్య సమర్పకులుగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు తిరుమల కిషోర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. సాంబశివారెడ్డి, సంతోష్‌కుమార్‌ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ‘‘యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్న చిత్రమిది’’ అని సినీవర్గాలు తెలిపాయి.


దిల్‌వాలా షురూ

‘పూలరంగడు’తో ప్రేక్షకుల్ని నవ్వించిన దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి నరేష్‌ అగస్త్య హీరోగా ‘దిల్‌వాలా’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. నబీషేక్‌, తూము నర్సింహ పటేల్‌ నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి కథానాయిక. రాజేంద్రప్రసాద్‌, అలీ రెజా, దేవ్‌గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు.


‘వీరయ్య’ కోసం సోలమన్‌ సీజర్‌గా..

చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ, బాబీ సింహా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఆదివారం బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో బాబీ పూల చొక్కా ధరించి మెడలో బంగారు గొలుసులు, చేతి కడియం, నల్లటి కళ్లజోడుతో వింటేజ్‌ లుక్‌లో కనిపించారు. ఇందులో ఆయన సోలమన్‌ సీజర్‌గా సందడి చేయనున్నట్లు తెలియజేశారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఆర్థర్‌ ఎ విల్సన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


టీనేజ్‌ ప్రేమకథ

యశ్వంత్‌ యజ్జవరుపు, తృప్తి శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓయ్‌ ఇడియట్‌’. వెంకట్‌ కడలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సత్తిబాబు మోటూరి, శ్రీనుబాబు పుల్లేటి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. విడుదలకి ముస్తాబవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టీనేజ్‌ ప్రేమకథతో ఈ సినిమా చేశారు. విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు.


థియేటర్‌లో చూడాల్సిన సినిమా

సుడిగాలి సుధీర్‌, గెహ్నా సిప్పి జంటగా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల తెరకెక్కించిన చిత్రం ‘గాలోడు’. సంస్కృతి ఫిలింస్‌ సంస్థ నిర్మించింది. సప్తగిరి, పృథ్విరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలైన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు సుధీర్‌. యువత, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉండే ఈ సినిమా థియేటర్‌కి వెళ్లి చూడాలన్నారు గెహ్నా.


థ్రిల్‌ పంచే ‘అధర్వ’

కార్తీక్‌ రాజు ప్రధాన పాత్రలో మహేష్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అధర్వ’. సుభాష్‌ నూతలపాటి నిర్మిస్తున్నారు. సిమ్రాన్‌ చౌదరి, ఐరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర కొత్త లుక్‌ విడుదల చేశారు. ‘‘వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురి చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: చరణ్‌ మాధవనేని.


‘అవతార్‌’ చాలిస్తా

ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’.  అవతార్‌ సిరీస్‌లో ఇది రెండో చిత్రం. మూడు, నాలుగు, ఐదో భాగాలూ ఉంటాయని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ గతంలోనే ప్రకటించారు. అయితే దీనికి భిన్నంగా.. ‘ఒకవేళ ‘అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌’ విజయం సాధించకపోతే నాలుగు, ఐదో భాగాలు తెరకెక్కించడం సాధ్యం కాద’నే సంచలనం విషయం తాజాగా వెల్లడించారు. ‘మూడు నెలల్లో అంతా తేలిపోతుంది. అవతార్‌ని మూడు భాగాలతో ముగించాలా? ఇంకా ముందుకెళ్లాలా.. అనేది అప్పుడే తెలుస్తుంది. సినిమాకి భారీ వసూళ్లు రాకపోతే, సరైన వ్యాపారం జరగకపోతే కథ ఇంతటితో ముగిసిపోయినట్టే’ అని ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సామ్‌ వర్తింగ్టన్‌, జో సల్దానా, స్టీఫెన్‌లాంగ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన రెండో భాగం డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని