Charmme: ‘లైగర్‌’ ఎఫెక్ట్‌.. ఛార్మి షాకింగ్‌ నిర్ణయం..!

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘లైగర్‌’ (Liger) పరాజయంతో చిత్ర నిర్మాత ఛార్మి (Charmme) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు...

Updated : 04 Sep 2022 12:11 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘లైగర్‌’ (Liger) పరాజయంతో చిత్ర నిర్మాత ఛార్మి (Charmme) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంపాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉండటానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘కాస్త శాంతించండి అబ్బాయిలూ.. సోషల్‌మీడియా నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నా. ‘పూరీ కనెక్ట్స్‌ ’ సంస్థ  మరింత దృఢంగా, ఉన్నతంగా సిద్ధమై త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది’’ అని ఛార్మి పేర్కొన్నారు.

విజయ్‌ దేవరకొండ - పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘లైగర్‌’ సిద్ధమైంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలకపాత్ర పోషించారు. రూ.100 కోట్లతో దీన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన నాటి నుంచే నెగెటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో కొన్నిరోజుల్లోనే థియేటర్ల నుంచి ఈ చిత్రాన్ని తీసేసే పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు, ‘లైగర్‌’ ఫ్లాప్‌తో విజయ్‌, ఇతర చిత్రబృందాన్ని నిందిస్తూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. ఛార్మి, పూరీ కనెక్ట్స్‌ని ట్యాగ్‌ చేస్తూ.. సినిమా అసలేం బాలేదంటూ. కథ, కథనంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్‌ చేశారు. ఛార్మిని సైతం నిందించారు. ఈ చిత్రానికి పూరీ డైరెక్ట్‌ చేయలేదని.. ఛార్మి చేసిందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే ఛార్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక, ఛార్మి - పూరీ - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రానున్న ‘జనగణమన’ని నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధం కానున్న ఈ చిత్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరకెక్కించడం సరికాదని పూరీ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు విజయ్‌తో మాట్లాడి దాన్ని ఆపేశారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని