Madhubala: ఒక భాష లక్ష్యంగా ఎప్పుడూ పనిచేయలేదు

‘‘ఇప్పుడనే కాదు పోటీతత్వం అన్నది చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఉంది. కాకపోతే దాన్ని నేనెప్పుడూ పోటీలా తీసుకోలేదు. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. ఆ పాత్రలే వస్తాయని నమ్మా. వాటిలో మనసుకు నచ్చిన వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్లా.

Updated : 23 Nov 2022 09:27 IST

‘‘ఇప్పుడనే కాదు పోటీతత్వం అన్నది చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఉంది. కాకపోతే దాన్ని నేనెప్పుడూ పోటీలా తీసుకోలేదు. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. ఆ పాత్రలే వస్తాయని నమ్మా. వాటిలో మనసుకు నచ్చిన వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్లా. ఇప్పుడు అలాగే సినీ ప్రయాణం కొనసాగిస్తున్నా’’ అన్నారు మధుబాల (Madhubala). ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మేన్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఓతరం సినీప్రియుల్ని అలరించిన నాయిక ఆమె. ఇప్పుడు ‘ప్రేమ దేశం’లో (Premadesam) కీలక పాత్ర పోషించారు. త్రిగుణ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన చిత్రమిది. శ్రీకాంత్‌ సిద్ధం దర్శకుడు. డిసెంబర్‌ 2న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు మధుబాల.

* ‘‘ఈ చిత్రంలో నేను త్రిగుణ్‌ తల్లిగా కనిపిస్తాను. గతంలో నేను చాలా సినిమాల్లో తల్లిగా నటించా. వాటిలో నా పాత్ర ఎంత బలంగా ఉంటుందో.. ఇందులోనూ అంతే కీలకంగా ఉంటుంది. దర్శకుడు నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ పాత్రను తీర్చిదిద్దుకున్నారట. తొలుత నేనీ సినిమా చెయ్యనని చెప్పా. కానీ, దర్శకుడు పదే పదే నన్ను కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. తనకి నాపై ఉన్న నమ్మకం నచ్చి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ చిత్రంలో తల్లీకొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు. నిజ జీవితంలో నేను నా పిల్లలతో ఎంత సరదాగా ఉంటానో.. ఇందులో అలాగే కనిపిస్తా. సినిమాలో నా కొడుకు తనతో స్నేహం చేయకముందే నేను హీరోయిన్‌తో స్నేహం చేస్తాను. ఈ సున్నితమైన ప్రేమకథకు మణిశర్మ అద్భుతమైన సంగీతమందించారు’’.

* ‘‘తెలుగు భాష నాకు అంతగా తెలియకపోయినా.. మిగతా భాషల్లో నటించిన దానికంటే తెలుగులో బాగా చేసినట్లుగా అనిపిస్తుంది. చాలా సౌకర్యంగా ఉంటుంది. ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌ ఇతరత్రా ఆదాయాల వల్ల ఇప్పుడు నిర్మాణ విలువలు పెరిగాయి. ఇది నిర్మాతలకూ మేలు చేకూరుస్తోంది. ఇంతకు ముందు చిన్న బడ్జెట్‌ సినిమాలంటే.. నిజంగానే చిన్న స్థాయిలో ఉండేవి. కానీ, ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు’’.

* ‘‘నాకు కామెడీ పాత్రలంటే చాలా ఇష్టం. అయితే ఒకటి రెండు హిందీ సినిమాల్లో తప్ప మిగతా భాషల్లో ఆ తరహా పాత్రల్లో నటించే అవకాశం రాలేదు. నటిగా నాలోని ప్రతిభను అన్ని కోణాల్లో ఆవిష్కరించుకోవాలని ఉంది. అందుకే నెగటివ్‌.. పాజిటివ్‌ అని లెక్కలేసుకోకుండా అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నా. ఇప్పుడు తెలుగు నుంచే ఎక్కువ పాన్‌ ఇండియా చిత్రాలొస్తున్నాయి. ఇక్కడ పని చేస్తే ఎక్కువ రీచ్‌ వస్తోంది. అందుకే ప్రస్తుతం తెలుగుపై దృష్టి పెట్టాను. నేనిప్పుడు హిందీలో ‘కర్తమ్‌ హుక్తమ్‌’ అనే చిత్రం చేస్తున్నా. ‘గేమ్‌ ఆన్‌’ అనే సినిమా పూర్తి చేశా. జీ5 కోసం ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నా’’.  

* ‘‘ఓ భాషనే లక్ష్యంగా చేసుకొని నేనెప్పుడూ పని చేయలేదు. నేను నా ప్రతిభను అన్ని చిత్రసీమలకు చూపించాలనుకున్నా. అందుకే ఏ భాషలోనూ నాకు ఎక్కువ సినిమాలు లేవు. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్‌’, ‘అల్లరి ప్రియుడు’ వంటి చిత్రాలతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఇప్పుడు రకుల్‌, తమన్నా వంటి వారు తెలుగు నేర్చుకుని.. ఇక్కడ వరుస సినిమాలు చేసినా ముంబయి అమ్మాయిల్లాగే చూస్తుంటారు. కానీ, ఆరోజుల్లో నన్నెవరూ ముంబయి అమ్మాయిలా చూడలేదు. ఏ భాషలో సినిమా చేస్తే.. ఆ ప్రాంతపు అమ్మాయిగానే గుర్తించారు. అదే నాకు ప్లస్‌’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని