Shaakuntalam: కాలాన్నే ఆపకా.. ఆగావే సాగకా...

శకుంతల మనసుకి తగిలిన గాయానికి కాలం ఎలా చికిత్స చేసింది? దుష్యంతుడికి దూరమై అసహాయురాలిగా మారిన ఆమె ఏం చేసిందో తెలియాలంటే ‘శాకుంతలం’ (Shaakuntalam) చూడాల్సిందే. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.

Updated : 16 Feb 2023 08:49 IST

కుంతల మనసుకి తగిలిన గాయానికి కాలం ఎలా చికిత్స చేసింది? దుష్యంతుడికి దూరమై అసహాయురాలిగా మారిన ఆమె ఏం చేసిందో తెలియాలంటే ‘శాకుంతలం’ చూడాల్సిందే. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా త్రీడీ టెక్నాలజీతో పౌరాణిక ప్రేమకథగా రూపొందిన చిత్రమిది. శకుంతలగా సమంత నటించారు. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించారు. గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మధుర గతమా... కాలాన్నే ఆపకా ఆగావే సాగకా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ఇటీవలే విడుదల చేశారు. మణిశర్మ స్వరకల్పనలోని ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, అర్మాన్‌ మాలిక్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. ‘‘దుర్వాసుడి శాపంతో దుష్యంతుడి ప్రేమకి, గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది శకుంతల. శాపంతోనే తన భార్యని మరిచిపోతాడు దుష్యంతుడు. అలా ఒకరికొకరు దూరమైనప్పుడు శకుంతల మనసులోని బాధని వ్యక్తం చేసే పాటే ఇది. భావోద్వేగాలతో, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేసేలా ఉంటుందీ పాట. విజువల్‌గానే కాకుండా, సంగీతం పరంగా కూడా ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతుంది. రీరికార్డింగ్‌ పనుల్ని బుడాపెస్ట్‌, హంగేరిలోని సంఫనీ సాంకేతిక నిపుణులతో చేయించామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్‌, మధుబాల, గౌతమి, అదితి బాలన్‌, అనన్య నాగళ్ల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: శేఖర్‌ వి.జోసెఫ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని