Madhuri dixit: అవకాశాల కోసం రాళ్లపై కూర్చుని..

అది 1980ల కాలం. అప్పటికి మాధురీ దీక్షిత్‌ (Madhuri dixit) సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Published : 03 Jul 2023 16:20 IST

కాసిన్ని మంచినీళ్లు కూడా ఇవ్వలేదట

అది 1980ల కాలం. అప్పటికి మాధురీ దీక్షిత్‌ (Madhuri dixit) సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఇద్దరు సోదరులు డాక్టర్‌ చదివి అమెరికాలో స్థిరపడ్డారు. మాధురి మాత్రం తన తల్లిదండ్రుల వద్దే ఉండిపోయారు. ముంబయిలోని జేబీ నగర్‌ ప్రాంతంలో నివసిస్తూ మైక్రోబయోలజిస్ట్‌ అవ్వాలనుకున్నారు. కానీ గోవింద్‌ మూనిస్‌ అనే ఓ బాలీవుడ్‌ రచయిత, దర్శకుడు ఓసారి మాధురిని చూసి సినిమాల్లో నటించమని అడిగారట.

ఈ విషయం గురించి మాధురి తల్లితోనూ చర్చించారు. అప్పటికే మాధురి కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉంది. ఇంట్లోవారే తన తండ్రిని మోసం చేసి ఆస్తులు లాక్కున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో సినిమాల్లో ప్రయత్నిస్తే పేరు, డబ్బు వస్తాయనుకుని ఓకే చెప్పారట. అలా గోవింద్‌, మాధురికి ‘అబోధ్‌’ అనే సినిమాలో అవకాశం ఇప్పించారు. ఈ సినిమాతో పాటు ఆమె సుదర్శన్‌ రతన్‌ తెరకెక్కించిన ‘మానవ్‌ హత్య’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ సినిమాను అర్ధరాత్రి అశ్లీల చిత్రాలు వచ్చే ఛానళ్లలో ప్రసారం చేసేవారు. దాంతో మాధురి తొలినాళ్లలో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.

ఓసారి మాధురి తన తల్లితో కలిసి ముంబయిలోని ఫిలిం సిటీ పరిసరాల్లో ఉన్న రాళ్లపై కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఏదో షూటింగ్‌ జరుగుతోంది. అందులో తనకు అవకాశం ఇవ్వకపోరా అని మాధురి ఎదురుచూశారు. ఆ సమయంలో వారి వద్ద తినడానికి, తాగడానికి ఏమీ లేవు. దాంతో అక్కడే ఉన్న స్పాట్‌బాయ్స్‌ను కాస్త మంచినీళ్లు ఇవ్వమని అడిగారట. కానీ వాళ్లు ఇవ్వకుండా వెళ్లిపోయారట. అప్పుడు రాకేశ్‌ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌ మాధురిని చూసి ఆమె ఫొటోలు తీశారు. ఈ ఫొటోలను ప్రముఖ దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌కు చూపించారు. మాధురి ఫొటోలు నచ్చి ఆమెతో పలు ప్రకటనలు చేయించారట. అక్కడి నుంచి మాధురికి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఎవరి నోట విన్నా మాధురి పేరే వినిపించేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని