Martin Luther King: అక్కడ యోగిబాబు.. ఇక్కడ సంపూర్ణేష్‌బాబు.. సూపర్‌హిట్‌ మూవీ రీమేక్‌!

తమిళంలో ఘన విజయం సాధించిన ‘మండేలా’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 19 Sep 2023 20:28 IST

హైదరాబాద్‌: సంపూర్ణేష్‌బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.  హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ సినిమాల్లో ఆయన చేసిన స్ఫూఫ్‌ సన్నివేశాలు నవ్వులు పంచాయి. తాజాగా సంపూర్ణేష్‌బాబు (sampoornesh babu) కీలక పాత్రలో ఓ ఆసక్తికర చిత్రం ప్రకటించారు. అదే ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. పూజ కొల్లూరు దర్శకురాలు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మండేలా’ చిత్రానికి ఇది రీమేక్‌.

యోగిబాబు కీలక పాత్రలో మడోనా అశ్విన్‌ ‘మండేలా’ తెరకెక్కించారు. పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి, సంపూ కీలక పాత్రలో తీర్చిదిద్దారు. మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంతకీ మండేలా కథేంటంటే:  తమిళనాడులోని ఓ గ్రామంలోని స్థానిక ఎన్నికలే ఇతివృత్తం. ఆ గ్రామంలో నెల్సన్‌ మండేలా (యోగిబాబు) బార్బర్‌గా పనిచేస్తుంటాడు. ఊళ్లో వాళ్లు నెల్సన్‌ను తమకు ఇష్టమైన పేర్లతో పిలుస్తుంటారు. అంతేకాదు, అన్ని పనులూ చేయిస్తుంటారు. అంతలో స్థానిక ఎన్నికలకు ప్రకటన వస్తుంది. ఈ ఎన్నికల్లో నెల్సన్‌ ఓటు కీలకం కావడంతో ఆ ఊళ్లో ఉన్న ఇద్దరు అభ్యర్థులూ తమకే ఓటు వేయాలని అతని చుట్టూ తిరుగుతుంటారు. అప్పటిదాకా అతణ్ని చాలా చిన్న చూపు చూసిన జనాలు కూడా మహారాజులా చూసుకోవడం మొదలుపెడతారు. ఈ క్రమంలో ఉచిత కానుకలు, హామీలు, బెదిరింపులు, దాడులు జరుగుతాయి. ఇన్ని సంఘటనల మధ్య నెల్సన్‌ ఏం చేశాడు? ఎవరికి ఓటు వేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే.. చివర్లో హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది.

తమిళంలో యోగిబాబు తన నటనతో మండేలా సినిమాను నిలబెట్టాడు. తనదైన కామెడీతో పాటు, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మరి తెలుగులో సంపూర్ణేష్‌బాబు ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని