Body shaming: విశ్వసుందరికీ తప్పని అవహేళన.. తన వ్యాధి గురించి చెప్పిన హర్నాజ్‌..!

విశ్వ సుందరి కిరీటం గెలిచి, అందాల సామ్రాజ్యంలో భారత్ జెండాను మరోసారి రెపరెపలాడించారు హర్నాజ్ సంధు. ప్రపంచం మెచ్చిన ఈ అందానికి కూడా బాడీ షేమింగ్ విమర్శలు తప్పడం లేదు.

Published : 02 Apr 2022 01:55 IST

చండీగఢ్‌: విశ్వ సుందరి కిరీటం గెలిచి, అందాల సామ్రాజ్యంలో భారత్ జెండాను మరోసారి రెపరెపలాడించారు హర్నాజ్ సంధు. ప్రపంచం మెచ్చిన ఈ అందానికి కూడా బాడీ షేమింగ్ విమర్శలు తప్పడం లేదు. అయితే తనపై రాసిన రాతలకు గట్టిగానే బదులిచ్చారు హర్నాజ్. తాను రోగనిరోధకతకు సంబంధించిన సెలియాక్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. 

‘మొదట్లో నేను చాలా సన్నగా ఉన్నానంటూ నా శరీరాకృతి గురించి అవహేళనలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు బరువు పెరిగానని విమర్శిస్తున్నారు. నేను సన్నగా ఉన్నా.. లావుగా ఉన్నా నన్ను నేను ప్రేమించుకుంటాను. అలాంటి ఒక వ్యక్తిత్వం, ధైర్యం ఉన్న మహిళల్లో నేను ఒకదాన్ని. అయితే నాకున్న సెలియాక్ వ్యాధి గురించి ఎవరికీ తెలీదు. దాని వల్ల నేను గోధుమ పిండి, ఇతర పదార్థాలు తినలేను’ అంటూ ఈ విశ్వసుందరి తన ఆరోగ్య పరిస్థితి గురించి బహిరంగంగా వెల్లడించారు. 

ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో హర్నాజ్‌ ర్యాంప్‌పై ఎర్రటి గౌన్‌లో మెరిపించారు. దానికి సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటిని చూసి, హర్నాజ్ బరువు పెరిగిందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టగా.. ఆమె తగిన సమాధానం ఇచ్చారు. 

సెలియాక్ వ్యాధి అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన రోగనిరోధక వ్యవస్థ మన శరీరంపై పొరపాటుగా దాడిచేసే పరిస్థితి. గ్లూటెన్ ఉన్న పదార్థాలు తింటే ఇది స్వయంగా ప్రేరేపితమవుతుంది. ఈ పరిస్థితి వల్ల పోషకాహార లోపం, ఎముకల సాంద్రత తగ్గడం, సంతానోత్పత్తి సమస్యలు, నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు. దీంతో బరువు పెరగనూ వచ్చు లేక తగ్గనూవచ్చు. ఇటీవల కాలంలో రోగనిరోధక శక్తికి సంబంధించిన మరోవ్యాధి గురించి ఆస్కార్ వేదికగా ప్రపంచం మొత్తానికి తెలిసింది. అదే అలోపేసియా ఎరేటా వ్యాధి. ఇది హాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల మధ్య వివాదానికి దారితీసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని