Ranveer Singh: ‘శక్తిమాన్‌’గా రణ్‌వీర్‌.. రీల్‌ ‘శక్తిమాన్‌’ అసహనం

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) ‘శక్తిమాన్‌’ పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై ‘శక్తిమాన్‌’ పాత్రధారి ముఖేశ్‌ ఖన్నా స్పందించారు. 

Published : 18 Mar 2024 20:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) ‘శక్తిమాన్‌’ పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై ‘శక్తిమాన్‌’ పాత్రధారి ముఖేశ్‌ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. రణ్‌వీర్‌ లాంటి వ్యక్తికి ఇది సెట్‌ కాదన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా వీడియో క్రియేట్‌ చేసి నెటిజన్లతో పంచుకున్నారు.

‘‘రణ్‌వీర్‌ సింగ్‌ శక్తిమాన్‌ పాత్రలో కనిపించనున్నారంటూ కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది దానిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ విషయంపై నేను స్పందించలేదు. కానీ, ‘శక్తిమాన్‌’ ప్రాజెక్ట్‌కు ఆయన సంతకం చేశారంటూ పలు ఛానెల్స్‌లోనూ వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పుడైనా మాట్లాడక తప్పదు. అతడు ఎంతటి నటుడైనా ఇది చెప్పక తప్పదు. అలాంటి ఇమేజ్‌ ఉన్న వ్యక్తి శక్తిమాన్‌ కాలేడు. ఇది ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘బ్యాట్‌మ్యాన్‌’, ‘కెప్టెన్‌ ప్లానెట్‌’తో పోటీ కాదని నిర్మాతలతో చెప్పా. శక్తిమాన్‌ కేవలం సూపర్‌హీరో మాత్రమే కాదు. ఆయనొక సూపర్‌ టీచర్‌ కూడా. శక్తిమాన్‌ పాత్ర పోషించే నటుడు.. ఏదైనా చెబితే ప్రేక్షకులు దాన్ని వినేలా ఉండాలి’’ అని ఆయన అన్నారు.

‘శక్తిమాన్‌’ పాత్రకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని.. ఒక సినిమా చేయాలనుకున్నారు దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌. భారీ స్థాయిలో దీనిని నిర్మించాలనుకున్నారు. రణ్‌వీర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారంటూ ఇటీవల వరుస కథనాలు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని