800 Movie: విజయ్‌ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్‌ వ్యాఖ్యలు

‘800’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ముత్తయ్య మురళీధరన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా నుంచి విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వైదొలగడానికి గల కారణాన్ని తెలియజేశారు.

Published : 25 Sep 2023 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిగ్గజ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (Muttiah Muralitharan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న చిత్రం ‘800’. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకుడు. అక్టోబర్‌ 6వ తేదీన ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మురళీధరన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. అనంతరం ఆయన.. ఈ ప్రాజెక్ట్‌ నుంచి విజయ్‌ సేతుపతి వైదొలగడానికి గల కారణాన్ని వెల్లడించారు.

‘‘800’ చిత్రాన్ని తెరకెక్కించాలని మేము ఎప్పుడో అనుకున్నాం. ఐపీఎల్‌ ఆడుతోన్న రోజుల్లో.. ఓసారి మేము ఉన్న హోటల్‌లోనే విజయ్‌ సేతుపతి సైతం బస చేశారు. షూట్‌ నిమిత్తం ఆయన ఆ హోటల్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో మా దర్శకుడు విజయ్‌ సేతుపతితో నాకు మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. దాదాపు ఐదు రోజుల తర్వాత రెండు గంటలపాటు ఆయన మాకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. నా ఆట తీరంటే తనకెంతో ఇష్టమని ఆయన నాతో చెప్పారు. ఈ క్రమంలోనే మేము ‘800’ కథ గురించి ఆయనతో డిస్కస్‌ చేశాం. కథ విన్నాక ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కథలో నటించే అవకాశాన్ని తాను వదులుకోనని.. తప్పకుండా భాగం అవుతానని చెప్పారు. మా మధ్య డీల్‌ కూడా కుదిరింది. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన పలువురు వ్యక్తుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం.. కుటుంబ సభ్యులు సైతం బెదిరింపులు ఎదుర్కొవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు జరిగారు. ఇది కేవలం క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. రాజకీయ, ఇతర కోణాలు ఈ కథలో లేవు’’ అని ఆయన చెప్పారు.

పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్‌ హీరో

‘‘నాకు హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. అలాగే, ఇక్కడి భోజనాన్ని నేను ఇష్టపడతా. ఇక్కడ నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. విశాఖపట్నం కూడా నాకెంతో ఇష్టం. అక్కడి వాతావరణం నాకు నచ్చుతుంది’’ అని హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన తెలిపారు.

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌.. శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘800’. టైటిల్‌ పాత్రను మధుర్‌ మిత్తల్‌ పోషించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుడిగా మొదట విజయ్‌ సేతుపతిని ఎంచుకున్నారు. దీనిపై పలువురు తమిళులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్‌ సేతుపతికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో విజయ్‌ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌ నుంచి పక్కకు జరిగారు. శ్రీలంక జాతీయవాదంతో అక్కడి తమిళులు తీవ్రంగా నష్టపోయారు. దీనిని నిరసిస్తూ శ్రీలంకకు చెందిన మురళీధరన్‌ బయోపిక్‌లో ఎలా నటిస్తారంటూ పలువురు తమిళ జాతీయవాదులు, తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సేతుపతి ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని