Naga Chaitanya: మత్స్యకారుల వలసల కథతో చైతూ సినిమా

బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నారు దర్శకుడు చందు మొండేటి.

Updated : 04 Aug 2023 13:59 IST

తుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నారు దర్శకుడు చందు మొండేటి. ఇందులో నాగచైతన్య కథానాయకుడిగా నటించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీమత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్యలేశం గ్రామాన్ని నాగచైతన్య గురువారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సుమారు ఆరు నెలల కిందట చందు మొండేటి చెప్పిన కథ నాలో స్ఫూర్తి నింపింది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిక్కోలు మత్స్యకారుల జీవన స్థితిగతులు, వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానం, ఇబ్బందులు, వ్యవహార శైలి, యాస, భాష స్వయంగా తెలుసుకొనేందుకు ఈ గ్రామానికి వచ్చాను. స్థానికులు చూపించిన ఆదరణ, ప్రేమాభిమానాలు నాలో మరింత ఉత్తేజాన్ని నింపాయి’’అన్నారు. 2018 నవంబరులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రంలో వీరవల్‌ వద్ద సముద్రంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున సరిహద్దు దేశం పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. వీరు పాకిస్థాన్‌లో ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ క్రమంలో పెళ్లైన కొద్ది రోజులకే కోస్టుగార్డులకు చిక్కడం, భార్యకు కానుపు జరిగినా ఏ బిడ్డ పుట్టిందో కూడా తెలియని స్థితి, బాలింతగా భార్య అవస్థలు లాంటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ప్రేమ కథా ఇతివృత్తంగా చిత్రాన్ని నిర్మించేందుకు సినిమా యూనిట్‌ సిద్ధమైంది. చైతూ వెంట దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీవాస్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని