Naseeruddin Shah: అక్కడి సినిమాలు చూడడం మానేశా: నసీరుద్దీన్‌ షా కామెంట్స్‌

బాలీవుడ్‌పై ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

Published : 19 Feb 2024 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిందీ చలన చిత్ర పరిశ్రమపై ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా (Naseeruddin Shah) షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. డబ్బు సంపాదన లక్ష్యంగా పనిచేయడం ఆపేస్తేనే బాలీవుడ్‌ (Bollywood)పై ఆశలుంటాయన్నారు. దిల్లీలో జరిగిన ‘మీర్‌ కీ దిల్లీ, షాజహానాబాద్‌: ది ఎవాల్వింగ్‌ సిటీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘హిందీ సినిమాకి 100 ఏళ్ల ఘన చరిత్ర ఉందని గర్వంగా ఫీలవుతాం. కానీ, అప్పటి నుంచీ ఒకే రకమైన చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ ధోరణి నిరుత్సాహానికి గురి చేసింది. కొంతకాలంగా హిందీ సినిమాలు చూడడం మానేశా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు హిందీ చిత్రాలు చూసేందుకు థియేటర్లకు ఆసక్తిగా వెళ్తుంటారు. త్వరలోనే ఆ పరిస్థితులు మారొచ్చు. ఎందుకంటే వారు విసిగిపోతారు. మనీ కోసం మాత్రమే సినిమాలు తీయడం ఆపేస్తే ఫలితం బాగుంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాస్తవాన్ని చూపించడం సీరియస్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ బాధ్యత’’ అని అన్నారు. ఒకప్పుడు ఇరాన్‌ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదురైనా అక్కడి ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమాలు రూపొందించారని పేర్కొన్నారు.

షా.. నిర్మోహమాటంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. ఇంతకుముందు.. టాలీవుడ్‌ చిత్రాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ను ఉద్దేశించి మాట్లాడి వార్తల్లో నిలిచారు. ‘‘ఈ మధ్యకాలంలో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అమెరికాలోని మార్వెల్‌ యూనివర్స్‌ చిత్రాలు సైతం ఇదే తరహాలోనివే. అదే పరిస్థితి భారత్‌లోనూ కనిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప ది రైజ్‌’ చిత్రాలను ఇప్పటివరకూ నేను చూడలేదు. ఇలాంటి సినిమాలు చూసి థ్రిల్‌ మినహా ప్రేక్షకులు ఏం పొందుతారో నాకు తెలియదు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చూశా. ఆయన గొప్ప దర్శకుడు. ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారు’’ అని అన్నారు.

1975లో తెరంగేట్రం చేసిన నసీరుద్దీన్‌.. ‘నిషాంత్‌’, ‘చక్ర’, ‘బజార్‌’, ‘మిర్చ్‌ మసాలా’, ‘కర్మ’, ‘సర్‌’, ‘హిమ్మత్‌’, ‘బొంబాయి బాయ్స్‌’ సహా 100కుపైగా చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించి, మెప్పించారు. హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషల్లో నటించారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో మూడు జాతీయ అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్‌, ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ పురస్కారాలు స్వీకరించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని