Nithya Menen: ఆధారాల్లేకుండా వ్యాప్తి చేశారు.. పెళ్లిపై నిత్యా మేనన్‌ స్పష్టత

‘‘నా పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలో నిజం లేదు. అదంతా కల్పితం’’ అని నటి నిత్యా మేనన్‌ మరోసారి స్పష్టం చేశారు.

Published : 25 Jul 2022 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘నా పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలో నిజం లేదు. అదంతా కల్పితం’’ అని నటి నిత్యా మేనన్‌ (Nithya Menen) మరోసారి స్పష్టం చేశారు. తమ వివాహ విషయమై వచ్చిన వదంతులపై మలయాళ మీడియా వేదికగా స్పందించిన ఆమె ఇప్పుడు నేరుగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. వివాహం గురించి ప్రస్తుతానికి తనకెలాంటి ఆలోచన, ప్రణాళిక లేవని తెలిపారు. ఎవరో ఓ వ్యక్తి తాను ఊహించుకుని ఓ ఆర్టికల్‌ రాస్తే దాన్ని ఎలాంటి ఆధారాల్లేకుండా అంతా దాన్ని వ్యాప్తి చేశారన్నారు. అనంతరం, సినిమాల గురించి మాట్లాడుతూ.. రోబోలా మెకానికల్‌గా ఉండటం తనకు ఇష్టం ఉండదని, అందుకే అప్పుడప్పుడు సినిమాలకు బ్రేక్‌ ఇస్తుంటానని తెలిపారు. తాను నటించిన ఐదారు సినిమాలు త్వరలోనే విడుదలకాబోతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. గాయమైన తన చీలమండ ప్రస్తుతం బాగానే ఉందని, వాకింగ్‌ చేస్తున్నానని తెలిపారు. వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నానన్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్‌ హీరోను నిత్యా మేనన్‌ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నెట్టింట వైరల్‌ అయిన ఈ టాపిక్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రశ్న ఎదురవగా అవన్నీ అసత్యమని నిత్య అప్పుడే తెలిపారు. ఇప్పుడు నేరుగా ఇలా వీడియో షేర్‌ చేశారు. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నిత్య 19(1)(a) అనే సినిమాతో త్వరలోనే సందడి చేయనున్నారు. మరోవైపు, ‘తిరుచిత్రంబళం’ (తమిళం), ‘ఆరామ్‌ తురికల్పన’ (మలయాళం) తదితర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని