Nivetha Pethuraj: ఆ వార్తల్లో నిజం లేదు.. రూమర్స్‌ పై స్పందించిన నివేతా పేతురాజ్‌

నివేతా పేతురాజ్‌ తనపై మీడియాలో వస్తోన్న వార్తలపై స్పందించారు.

Published : 05 Mar 2024 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మెంటల్‌ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేతా పేతురాజ్‌ (Nivetha Pethuraj). విశ్వక్‌ సేన్‌తో కలిసి నటించిన ‘పాగల్‌’, ‘దాస్‌ కా దమ్కీ’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల నివేతా కోసం తమిళ నటుడు, రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ డబ్బులు ఖర్చు పెట్టారంటూ తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి. వీటిని ఆమె తీవ్రంగా ఖండించారు. నాకోసం ఎవరూ డబ్బు ఖర్చు చేయలేదు, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి, మా కుటుంబాన్ని బాధకు గురి చేయొద్దని అభ్యర్థిస్తున్నా అని ఆమె పేర్కొన్నారు.

‘‘నాకోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.  అలాంటి వార్తలు రాసే వారికి కొంత మానవత్వం ఉంటుందని,  అది నిజమో, కాదో ధ్రువీకరించుకొనే సమయం వారికి ఇవ్వాలనుకున్నా. అందుకే ఇప్పటివరకూ ఈ వార్తలపై నేను స్పందించలేదు. ఒక అమ్మాయి గురించి ఇలాంటి వార్తలు రాసేముందు ఆలోచించుకోండి. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని, ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయరని ఆశిస్తున్నా. అందుకే లీగల్‌గా యాక్షన్‌ తీసుకోవడం లేదు. నాపై వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నాకు డబ్బే ప్రామాణికం కాదు. సినిమాలు చేస్తున్నా అవకాశాల కోసం ఎవరినీ అడగలేదు. నేనూ అందరిలా సాధారణ జీవనమే సాగిస్తున్నా. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నాను. 16 సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్‌గా ఉంటున్నా. ఎవరినీ డబ్బులు అడిగే అవసరం లేదు. ఇప్పటికీ మేము దుబాయ్‌లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. నా కుటుంబం కోరుకున్నట్లు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటున్నా. ఇకపై ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దు. ఇకనైనా నిజాలు గ్రహించండి. నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు ’’ అంటూ ఎక్స్‌లో నివేతా పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని