Waltair Veerayya: మెగా అభిమానులకు ఇదొక వరం.. రామ్‌చరణ్‌ ఆ పాత్ర చేసి ఉంటే..: పరుచూరి

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాపై  ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ  సమీక్ష ఇచ్చారు. పరుచూరి పలుకులు వేదికగా తాజాగా ఆయన వీడియో షేర్‌ చేశారు.

Published : 18 Mar 2023 13:53 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన హిట్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). పగ, ప్రతీకారం నేపథ్యంలో వచ్చిన ఈ కమర్షియల్‌ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మెగా అభిమానులకు ఈ సినిమా ఓ వరం అని ఆయన అన్నారు. కథా కథనం, రవితేజ, చిరంజీవి నటన.. అద్భుతంగా ఉందని చెప్పారు. రవితేజ పోషించిన పాత్రను ఒకవేళ  రామ్‌చరణ్‌ చేసి ఉంటే ఎలా ఉండేదనే విషయాన్నీ ఆయన ప్రస్తావించారు.

‘‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) హిట్‌ అయ్యిందని తెలిసినప్పుడు ఎంత ఆనందించానో సినిమా చూస్తున్నంత సేపు అంతే సంతోషాన్ని పొందాను. కొన్ని సినిమాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ, ఇది వెంటాడే సినిమా కాదు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. దర్శకుడు కథను చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ షాట్‌కు ఆడిటోరియం మొత్తం షాక్‌ అయిపోయి ఉంటుంది. సినిమా పూర్తయ్యాక వచ్చే సందేశం అందరితో చప్పట్లు కొట్టిస్తుంది.

ఇందులో రవితేజ (Ravi Teja) పోషించిన పాత్రను రామ్‌ చరణ్‌ (Ram Charan) చేసి ఉంటే ఎలా ఉంటుందా? అని ఆలోచించాను. రవితేజ పాత్ర చిత్రీకరణ చూశాక.. చరణ్‌ చేస్తే బాగోదనే నిర్ణయానికి వచ్చా. ఎందుకంటే, తమ్ముడి పాత్రలో చరణ్‌కు అన్యాయం జరిగినట్టు చూపిస్తే.. చిరంజీవి పాత్రకు మైనస్‌ మార్కులు పడేవి. ఆ పాత్రకు రవితేజను ఎంపిక చేసుకోవడం బాగుంది. ఆయన అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులు సరిగ్గా గమనిస్తే.. ఈ సినిమాలో రవి బాడీ లాంగ్వేజ్‌ కాస్త భిన్నంగా ఉంటుంది. చిరంజీవి సినిమా కాబట్టి.. మెగా ఆడియన్స్‌ పల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయన నటించాడు. చిరంజీవి, రవితేజ.. వాళ్ల అనుబంధం, హీరోయిన్స్‌తో ప్రేమాయణం.. వంటివి మాత్రమే చూపిస్తే సినిమా హిట్లు అయ్యేది కాదు.

కథా కథనం బాగుంటే.. సినిమా నిడివి ఎంత ఉన్నా ప్రేక్షకులు కళ్లార్పకుండానే చూస్తారు. అలా చూసినప్పుడు తప్పకుండా ఆ సినిమా హిట్టైనట్టే. అదే ఇక్కడ జరిగింది. తనకు వర్టిగో వ్యాధి ఉందని చెప్పే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది. ఆ వ్యాధితో ఆయన ఏమైపోతాడోననే భయాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. డైలాగ్స్‌, ఊహకందని ట్విస్టులతో సినిమా చాలా బాగుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు పాతికేళ్ల క్రితం చిరంజీవి గుర్తుకువచ్చారు. 1980,90ల్లో ఆయన బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉందో.. ఇందులోనూ సేమ్‌ అలాగే కనిపించారు. ఇక ప్రకాశ్‌రాజ్‌, కేథరిన్‌ బాగా చేశారు. వారి పాత్రలూ సినిమా విజయంలో స్థానం దక్కించుకున్నాయి’’ అని పరుచూరి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని