Baby: అలా చేసుంటే ‘బేబీ’ సినిమాకు మరో ముగింపు ఉండేది

యూత్‌కు ఎంతో కనెక్ట్‌ అయిన ‘బేబీ’(Baby) సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఓ సన్నివేశంలో మార్పు చేసుంటే ఈ కథకు మరో ముగింపు ఉండేదని ఆయన అన్నారు.

Published : 02 Sep 2023 17:36 IST

హైదరాబాద్‌: ఇటీవల విడుదలై యూత్‌ను ఎంతో ఆకర్షించిన చిత్రం ‘బేబీ’ (Baby). చిన్న సినిమాగా విడుదలై విమర్శకుల ప్రశంసల అందుకున్న ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పరుచూరి పాఠాల్లో భాగంగా ఆయన ఈ సినిమాను విశ్లేషించారు. నేటి తరానికి దగ్గరగా ఉన్న కథ కాబట్టే ‘బేబీ’ ఇంతటి విజయం సాధించిందని పరుచూరి అన్నారు. అద్భుతమైన ప్రేమకథను ఊహించని క్లైమాక్స్‌తో ముగించారని దర్శకుడిని ఆయన ప్రశంసించారు.

‘‘హీరో (Anand Deverakonda) గడ్డం పెంచుకున్నట్లు చూపించడంతో మొదలైన ఈ కథలో అద్భుతమైన మలుపులు చూపించారు. హీరోయిన్‌, హీరోని కాకుండా మరో వ్యక్తిని పెళ్లిచేసుకున్నట్లు చూపించిన అతి తక్కువ సినిమాలు మాత్రమే ఇప్పటి వరకూ విజయం సాధించాయి. దర్శకుడు సాయి రాజేశ్‌ ‘బేబీ’ సినిమాను చాలా తెలివిగా రూపొందించారు. ప్రేమించుకున్న వారి మధ్య ఓ చిన్న తప్పు జరిగింది. ఆ తప్పును హీరోయిన్ ప్రేమించిన వ్యక్తికి చెప్పి ఉంటే ‘బేబీ’ సినిమాకు మరో ముగింపు ఉండేది. కానీ, అతడికి ఆ తప్పును తెలియజేయకుండా దాని మర్చిపోవడం కోసం మరో తప్పు చేసింది’’. 

 ఓటీటీలోకి ‘జైలర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘‘ఈ సినిమాలో హీరోని ఆటో డ్రైవర్‌గా.. హీరోయిన్‌ని ఇంజనీరింగ్‌ చదివే అమ్మాయిగా చూపించారు. అసలు ఆటో డ్రైవర్‌ను ఇంజనీరింగ్‌ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? అనే పెద్ద ప్రశ్నను ప్రేక్షకులకు కలిగేలా చేశారు. వీళ్లిద్దరి మధ్యలో విరాజ్‌ పాత్రను ప్రవేశపెట్టి ఓ ట్రైయాంగిల్‌ లవ్ స్టోరీలోకి తీసుకెళ్లారు. ‘ఏదో జరుగుతున్నట్లు.. నా గుండె అదురుతోంది’ అని ఓ బలమైన డైలాగును రాశారు. ఈ డైలాగుతో ఓ పెద్ద గండం రానుందని దర్శకుడు హెచ్చరించారు. అదే సమయానికి విరాజ్‌ ఎంట్రీని చూపించారు. ఇలా చేయడానికి తెలివితేటలు కావాలి. ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి మేకప్‌ వేసుకుని మారిపోయే సందర్భంలో నాగబాబు చెప్పే డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ఆయన చాలా సహజంగా నటించారు’’.

‘‘విరామ సన్నివేశంలో భయంకరమైన షాట్‌ను చూపించారు. దాన్ని మైండ్‌బ్లోయింగ్‌ షాట్‌ అంటారు. మళ్లీ సెకండాఫ్‌ మొదలవ్వగానే మరో ట్విస్ట్‌ చూపించారు. హీరోయిన్‌ (Vaishnavi) మరో వ్యక్తిని ముద్దు పెట్టుకుందని తెలిసిన మరుక్షణం హీరోకు తెలిస్తే ఏమవుతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లోనూ కలిగించారు. సినిమాలో హీరోయిన్‌ డేటింగ్ చేసే సమయంలో విరాజ్‌పై ప్రేమను చూపించి ఉంటే సినిమాకు ఊపిరి ఉండేది కాదు.. ఆ సమయంలో కూడా హీరోయిన్‌కు హీరోపైనే ప్రేమ ఉందని చూపించారు. అయితే హీరోయిన్ స్నేహితురాలు చెప్పిన చెడ్డ సలహా కారణంగా సినిమా కీలక మలుపు తిరుగుతుంది. ఈ సలహా పాయింట్‌ను రాసుకున్నందుకు సాయి రాజేశ్‌ ధైర్యానికి అభినందించాలి. ఎంతో ధైర్యంగా రాశాడు అంతే ధైర్యంగా తీశాడు. ప్రేమకు, కామానికి మధ్య నలిగిపోయే వ్యక్తిగా విరాజ్‌ పాత్రను చూపించారు’’.

నా కల నెరవేరిన రోజది: విశాల్‌పై అభినయ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘భారతదేశంలో ఏ ఆడపిల్లా తీసుకోని నిర్ణయం ఈ సినిమాలో హీరోయిన్ తీసుకుంది. అయినా, ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. దానికి కారణం నేటి యువతరం ఆలోచనలు ఇలానే ఉన్నాయని చాలామంది నమ్మారు కాబట్టే దీనికి ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఇక హీరోయిన్ మరో వ్యక్తికి శారీరకంగా దగ్గరవ్వకుండా ఉండుంటే చివర్లో హీరోతో కలవడానికి అవకాశం ఉండేది. హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందనే షాక్‌కు నేనూ ఉలిక్కిపడ్డా. ఏదైమేనా ఈ సినిమా ఓ సాహసమని చెప్పాలి. రిస్క్‌ తీసుకుని రాసిన కథలకు కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపితమైంది’’ అంటూ ‘బేబీ’ చిత్రబృందాన్ని పరుచూరి గోపాలకృష్ణ అభినందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని