Adipurush: ‘ఆదిపురుష్‌’కు వ్యతిరేకంగా.. దిల్లీ కోర్టులో పిటిషన్‌

ఆదిపురుష్‌ (Adipurush) సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ చిత్రానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Updated : 17 Jun 2023 10:54 IST

దిల్లీ: ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్‌ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్‌ (Adipurush)’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాకు వ్యతిరేకంగా కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. హిందువుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తీశారంటూ హిందూసేన (Hindu Sena) జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త దిల్లీ హైకోర్టు (Delhi High Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

‘‘వాల్మీకి, తులసీదాస్‌ వంటి వారు రచించిన రామాయణం (Ramayanam)లోని పాత్రలకు విరుద్ధంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను అనుచిత రీతిలో తెరకెక్కించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇందులో పాత్రలు ఉన్నాయి. ఈ చిత్రంలో దేవతామూర్తుల వర్ణన సరైన రీతిలో లేదు. హిందూ బ్రాహ్మణుడైన రావణ పాత్రధారి గడ్డంతో కన్పించడం అభ్యంతరకరంగా ఉంది. ఇది హిందూ నాగరికతను అవమానించడమే. రావణుడికి సంబంధించిన సన్నివేశాలను కూడా వాస్తవాలకు దూరంగా తెరకెక్కించారు. ఇందులో దేవతామూర్తులకు సంబంధించిన అభ్యంతకర సన్నివేశాలను సరిదిద్దడం లేదా తొలగించడం చేయాలి. లేదంటే సినిమా ప్రదర్శనను నిలిపివేయాలి’’ అని విష్ణు గుప్త తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కాగా.. ఆదిపురుష్‌ (Adipurush) సినిమా విడుదలకు ముందు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గతంలో ఈ సినిమా టీజర్‌ విడుదలైన సమయంలో.. చిత్రంలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం సరైందని కాదని.. పలు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆదిపురుష్‌ చిత్రబృందం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే విజువల్స్‌లో కొన్ని మార్పులు చేసి సినిమాను నిన్న విడుదల చేశారు. కాగా.. ఈ సినిమాకు విశేష స్పందన లభించినప్పటికీ.. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని