Prakash Raj: నేను క్రియేటర్‌నికాదు.. అందుకే ఆ విషయం తెలీదు: ప్రకాశ్‌రాజ్‌

తన తాజా వెబ్‌ సిరీస్‌ ‘ముఖ్‌బిర్‌’ త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 10 Nov 2022 01:26 IST

హైదరాబాద్‌: ‘నా దగ్గరకు వచ్చిన పాత్రల్లో నేను నటిస్తున్నాను తప్ప నాలో నటుడున్నాడనే సంగతి నాకు తెలియదు. నేను క్రియేటర్‌ని అయితే ఆ విషయం తెలిసేది’ అని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. తాను నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ముఖ్‌బిర్‌’ త్వరలో విడుదలకానున్న నేపథ్యంలో ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మీలోని నటుణ్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం రాలేదని ఎప్పుడైనా ఫీల్‌ అయ్యారా?’ అనే ప్రశ్నకు ప్రకాశ్‌రాజ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘నాలో నటుడు ఉన్నాడని నాకు తెలియదు’ అని చెప్పారు. సమయపాలన గురించి మాట్లాడుతూ.. ‘‘బిజీగా ఉండే వ్యక్తులకే సమయం ఎక్కువగా ఉన్నట్టుంటుంది. ఎందుకంటే వారికి దాని విలువ తెలుసు. 24 గంటల సమయం సరిపోవట్లేదని చెబుతున్నారంటే సోమరితనం వల్లే. నేను అప్రమత్తంగా ఉంటా. అందుకే అన్ని విషయాలపై స్పందిస్తా. ప్రేక్షకులు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటా’’ అని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు.

గూఢచార్యం నేపథ్యంలో తెరకెక్కిన ‘ముఖ్‌బిర్‌’లో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్‌ నవంబరు 11న ఓటీటీ ‘జీ 5’లో విడుదలకానుంది. శివమ్‌ నాయర్‌, జయ్‌ప్రద్‌ దేశాయ్‌ సంయుక్త దర్శకత్వంలో ఈ సిరీస్‌ రూపొందింది. మరోవైపు, ప్రకాశ్‌రాజ్‌ తెలుగులో నటించిన ‘రంగమార్తాండ’, ‘శాకుంతలం’ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని