Suryadevara Naga Vamsi: నా దృష్టిలో ఇదీ ఓ ప్రయోగమే

‘‘చిన్న పెద్ద అనే తేడా లేకుండా నచ్చిన కథల్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్న నిర్మాత ఆయన.  ‘డీజే టిల్లు’ తర్వాత మళ్లీ అంతగా నవ్వించిన సినిమా రాలేదనీ, అలా ఇంటిల్లిపాదీ కలిసి నవ్వుకునేలా మేం తీసిన మరో కుటుంబ కథా చిత్రమే మా  ‘స్వాతిముత్యం’ అంటున్నారు.

Updated : 02 Oct 2022 08:24 IST

‘‘చిన్న పెద్ద అనే తేడా లేకుండా నచ్చిన కథల్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్న నిర్మాత ఆయన.  ‘డీజే టిల్లు’ (DJ Tillu) తర్వాత మళ్లీ అంతగా నవ్వించిన సినిమా రాలేదనీ, అలా ఇంటిల్లిపాదీ కలిసి నవ్వుకునేలా మేం తీసిన మరో కుటుంబ కథా చిత్రమే మా  ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam) అంటున్నారు. ఆయన నిర్మాణంలో గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగవంశీ హైదరా బాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ప్రతీ శుక్రవారం రెండు మూడు సినిమాలు విడుదల కావడం సహజంగా మారింది. ఇక పండగల సమయంలో మూడు సినిమాలొచ్చినా ఏం ఇబ్బంది ఉండదు. ఆ నమ్మకంతోనే సినిమాని దసరాకి విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తే తప్పకుండా నవ్వుకుని బయటికి వస్తారు. అలాగని కేవలం నవ్వించడం కోసమే తీసిన సినిమా కాదు. వీర్యదానం అనే అంశం చుట్టూ ఈ కథ సాగినా అది ఎవ్వరికీ ఇబ్బందికరం కాని రీతిలో ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. కథతోపాటే గణేశ్‌ వచ్చారు. ఒక అమాయకుడి చుట్టూ సాగే ఈ కథకి తను బాగా నప్పాడు. వర్ష బొల్లమ్మ ఒక చిన్న టౌన్‌కి చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది. ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’లో ఆమె నటనని చూసి ఎంపిక చేశాం. లక్ష్మణ్‌ చాలా నమ్మకంగా అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు ఇచ్చాం అంతే’’.

* ‘‘మేం తీసిన ‘డీజే టిల్లు’ తర్వాత అన్నీ భారీ సినిమాలే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మొన్న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’... ఇలా వేటికవే భిన్నమైన సినిమాలు. వినోదాత్మక చిత్రాలు పెద్దగా రాలేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఉంటుందీ చిత్రం. నా దృష్టిలో ఇది కూడా ఓ ప్రయోగమే. ‘డీజే టిల్లు’ మొదులకొని ‘వరుడు కావలెను’, ‘స్వాతిముత్యం’ ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. తదుపరి వరుసగా వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేస్తున్నాం. బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్‌తేజ్‌, నవీన్‌ పోలిశెట్టిలతో సినిమాలు చేస్తున్నాం. కళాశాల నేపథ్యంలో సాగే ఓ కథతో ఎన్టీఆర్‌ బావమరిది నితిన్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాం. ‘డీజే టిల్లు2’  చిత్రీకరణ మొదలైంది. ఇందులో నాయికగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది’’.  

* ‘‘మా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలో రూపొందుతున్న మహేష్‌బాబు చిత్రం అంచనాలకి దీటుగా ఉంటుంది. మహేష్‌బాబు ఇప్పటివరకు చేయని పాత్రని ఇందులో చేస్తున్నారు. మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లలో అంతగా ఆదరణ పొందలేదు. కానీ టీవీల్లో ఆ సినిమాల్ని చూసి ఈ కలయికపై ప్రత్యేకమైన అంచనాల్ని పెంచుకున్నారు. ఏ స్థాయిలో అంచనాలు పెంచుకుని వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఉంటుంది చిత్రం. ఇందులో మాస్‌ని మెప్పించేలా ఓ  ప్రత్యేక గీతం కోసం దర్శకుడిని అభ్యర్థించాం. ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని