Raashii Khanna: సెలబ్రిటీల ఫొటోలు తీయడానికీ హద్దు ఉంటుంది. దీనిపై చట్టాలు రావాలి: రాశీ ఖన్నా

బాలీవుడ్‌ నటి అలియా భట్‌ (Alia Bhatt) ఇటీవల ఎదుర్కొన్న ఘటనపై రాశీ ఖన్నా (Raashii Khanna) మాట్లాడింది. మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చట్టాలు రావాలని తెలిపింది.

Updated : 24 Feb 2023 12:21 IST

ముంబయి: అలియా భట్‌ (Alia Bhatt) వ్యక్తిగత గోప్యతపై ఇటీవల పెట్టిన పోస్ట్‌ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై సినీ ప్రముఖులందరూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. కొందరు సెలబ్రిటీలు ఆమెకు మద్దతు తెలుపగా మరికొందరు ఈ విషయంలో వారు ఎదర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోని హీరోయిన్‌లు కూడా ఈ విషయంపై పెదవి విప్పారు. తాజాగా హీరోయిన్‌ రాశీ ఖన్నా (Raashii Khanna) ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా పోస్ట్‌ గురించి మాట్లాడింది. 

‘‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత ఉంటుంది. దానిని అందరూ గౌరవించాలి. సెలబ్రిటీ కనిపించినప్పుడు ఫొటోలు తీసుకోవచ్చు. ప్రత్యేకించి అలియా భట్‌ లాంటి వాళ్లు కనిపిస్తే మీరు చిత్రాలు తీసుకోండి. దానిని ఎవరూ వ్యతిరేకించరు. కానీ దానికి ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ప్రవర్తించకూడదు. అలా చేస్తే అది దాడితో సమానం అని నా అభిప్రాయం. ఇలా జరిగింది అలియాకా.. మరొకరికా అని నేను చెప్పడం లేదు. ఈ విషయంలో ఎవరైనా ఒకటే. ఇలాంటివి జరగకుండా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది రాశీ ఖన్నా.

ఇక ఇటీవల అలియా భట్‌కు తెలియకుండా తన పక్కింటి నుంచి ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడినా అలియా ఇలా చేయడం సమంజసమేనా అని ప్రశ్నిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌కు ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా అలియాను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని