Rajamouli: రామాయణం నుంచే ‘బాహుబలి’.. అందుకే ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారు!

అమరేంద్ర బాహుబలి పాత్రను రామాయణం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నట్లు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Updated : 23 Jun 2023 17:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చిత్రం  ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తమ నటనతో మెప్పించగా, రాజమౌళి టేకింగ్‌ సినిమాను విజయ పథంలో నడిపింది. అమరేంద్ర బాహుబలి పాత్రకు రాముడే స్ఫూర్తి అని ఓ సందర్భంలో రాజమౌళి చెప్పుకొచ్చారు. రామాయణం నుంచి స్ఫూర్తి పొంది ఆ పాత్రను డిజైన్‌ చేసుకున్నట్లు చెప్పారు.

‘‘అమరేంద్ర బాహుబలి’ పాత్ర రామాయణం నుంచి స్ఫూర్తి పొంది తీర్చిదిద్దిందే. ముఖ్యంగా రాముడిలో ఉండే లక్షణాలు ఆ పాత్రలో ఉంటాయి. రాముడు చాలా వినయంగా ఉంటాడు. ఎప్పుడో ఓసారి కానీ, ఆవేశంగా మాట్లాడడు. ఏక పత్నీవ్రతుడు. పెద్దలు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే, ఆ పాత్ర రెగ్యులర్‌ కమర్షియల్‌ కాదు. భారతదేశంలో కృష్ణుడికి ఒక గుడి ఉంటే 50 రాముడి ఆలయాలు ఉంటాయి. రాముడిని ఏమైనా అంటే భారతీయులు తట్టుకోలేరు. ఆవేశం పొంగుకుని వస్తుంది. అంతలా ఆరాధిస్తారు. అంత భక్తిభావన ఎందుకా? అని ఆలోచించా’’

‘‘నేను అనుకున్నది ఏంటంటే.. వాల్మీకి రామాయణం రాసినప్పుడు రాముడితో పాటు, మాస్‌ క్యారెక్టర్‌లైన హనుమంతుడు, లక్ష్మణుడు తదితర పాత్రలను చాలా బలంగా తీర్చిదిద్దారు. వాళ్లు రాముడి కోసం ప్రాణాలు ఇస్తారు. రాముడిని ఏదైనా అంటే ఊరుకోరు. డైరెక్ట్‌ హీరోయిజం కాకుండా అప్లయిడ్‌ హీరోయిజాన్ని వాల్మీకి చూపించారని నాకు అనిపించింది. రాముడిని సాఫ్ట్‌గా చూపించి చుట్టూ ఉన్న పాత్రలు ఆయన్ని దేవుడు అనడం వల్లేనేమో రాముడిని ఎవరైనా ఏదైనా అంటే మనకు కూడా ఆవేశం వచ్చేస్తుంది. ఇది నాకు అనిపించిన థియరీ మాత్రమే. అందుకే అమరేంద్ర బాహుబలి పాత్ర రాముడిలా ఉంటుంది. కట్టప్ప, శివగామి, దేవసేనలాంటి మాస్‌ పాత్రలు బాహుబలిని దేవుడు అంటాయి. అది ప్రేక్షకులకు బాగా నచ్చి ఉంటుంది’’ అని రాజమౌళి ‘బాహుబలి’ పాత్ర వెనుక కథను పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని