‘బ్రహ్మాస్త్ర’లో ఆ విషయం నాకు బాగా నచ్చింది: రాజమౌళి

ప్రస్తుతం బాలీవుడ్ జంట రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor)‌, అలియా భట్‌(Alia Bhatt) తమ సినిమా ‘బ్రహ్మాస్త్ర’: మొదటి భాగం-శివ’(Brahmastra: Part One-Shiva) ప్రచార వేగాన్ని......

Updated : 29 Jun 2023 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం బాలీవుడ్ జంట రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor)‌, అలియా భట్‌(Alia Bhatt) తమ సినిమా ‘బ్రహ్మాస్త్ర’: మొదటి భాగం-శివ’(Brahmastra: Part One-Shiva) ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. హిందీ మీడియాతో అలియా భట్‌, సౌత్‌లో రణ్‌బీర్‌, నాగార్జున(Nagarjuna) బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశానికి అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి(S.S.Rajamouli)ని అతిథిగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు రాజమౌళి ‘బ్రహ్మాస్త్ర’ కు సంబంధించి తనకు నచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. ‘చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న, ఊహించుకున్న అస్త్రాల గొప్పతనాన్ని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ప్రపంచానికి చూపించబోతున్నారు. దానికోసం అద్భుతమైన ప్రపంచాన్ని ఆయన సృష్టించారు. ‘అస్త్రాల’ కథను కమర్షియల్‌ కోణంలో చెప్పడం నాకు బాగా నచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’తో భారతీయ సంస్కృతి, పురాణాల వైభవం ప్రపంచానికి మరింత గొప్పగా పరిచయం కానుంది. అయాన్‌ కన్న కలలకు దృశ్యరూపమిది. ఆయనకు కరణ్‌ జోహార్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియా, నాగార్జున, అమితాబ్‌ సార్‌లు మద్దతు ఇచ్చారు. 2014నుంచి సాగుతున్న బ్రహ్మాస్త్ర సుదీర్ఘ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు’’ అని అన్నారు.

సెప్టెంబరులో విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై చిత్ర యూనిట్ భారీ ఆశలే పెట్టుకుంది. అమితాబ్‌ బచ్చన్(Amitabh Bachchan)‌, నాగార్జున ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రంలో షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) అతిథి పాత్రలో మెరవనున్నారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వం వహించగా, కరణ్‌జోహార్(Karan Johar)‌, రణ్‌బీర్‌కపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రం రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని