
Rowdy Boys: ప్రతిభ ఉంటే సరిపోదు క్రమ శిక్షణ ఉండాలి: రామ్‌చరణ్
హైదరాబాద్: నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. హర్ష కొనుగంటి దర్శకుడు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘మ్యూజికల్’ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
వేడుకనుద్దేశించి రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆశిష్ బాగా నటించాడని తెలిసింది. ట్రైలర్ చూశా బాగా నచ్చింది. ఆశిష్ ఎనర్జీ ఆకట్టుకుంది. డ్యాన్స్ అద్భుతంగా చేశాడు. నటుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. ఏ రంగంలోనైనా రాణించాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉన్నవారికి ప్రతిభ లేకపోయినా అవకాశాలెక్కువగా ఉంటాయి. ప్రతిభ ఉండి క్రమశిక్షణ లేకపోతే వృథా. మా నాన్నగారు (చిరంజీవి) నాకు అదొక్కటే చెప్పారు. ఎలా నటించాలో, నర్తించాలో చెప్పలేదు. అనుపమ పరమేశ్వరన్ గురించి సోషల్ మీడియాలోనూ చూస్తుంటా. ఆమె నవ్వు చాలా బాగుంటుంది’’ అని అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకపోయినా మాకేం బాధ లేదు ఎందుకంటే అది సరైన సమయంలో రావాలి. దాని కోసం సుమారు 4 ఏళ్లు కష్టపడ్డాం. విడుదల ఎప్పుడు అనేది రాజమౌళి, దానయ్య గారు నిర్ణయిస్తారు. సంక్రాంతి మాకేంత ముఖ్యమో తెలియదు గానీ దిల్ రాజు గారికి చాలా ముఖ్యం’ అని రామ్‌చరణ్ అన్నారు.