Shriya: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తారక్‌, చరణ్‌ ఉన్నారని తెలీదు: శ్రియ

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని నేనింకా చూడలేదు అంటోన్న నటి

Published : 31 Mar 2022 10:49 IST

సినిమా చూడలేదు.. టికెట్లు దొరకడం లేదు

బెంగళూరు: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని తానింకా వీక్షించలేదని నటి శ్రియ అన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ సినిమా టిక్కెట్లు దొరకడం లేదని, ప్రతి చోటా హౌస్‌ఫుల్‌ బోర్డులే కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్‌ దేవ్‌గణ్‌కు జోడీగా సరోజిని పాత్రలో శ్రియ కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా షూట్‌ కోసం బెంగళూరులో ఉన్న ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఛత్రపతి’ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రాజమౌళితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

‘‘ఛత్రపతి’ కోసం మొదటిసారి రాజమౌళి సర్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం వచ్చింది. అది నా కెరీర్‌లో సూపర్‌హిట్‌. దాని తర్వాత రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటించాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. అలాంటి సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ కీలకపాత్ర పోషించే అవకాశం దక్కింది. రాజమౌళి టీమ్‌తో కలిసి మరోసారి వర్క్‌ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా ఆయన సినిమాలో భాగం అవుతా’’

‘‘రాజమౌళి సినిమా అనగానే సంతకం చేసేశాను. నా రోల్‌ ఏమిటి? నాతోపాటు ఎవరు వర్క్‌ చేస్తున్నారు? మెయిన్‌ నటీనటులు ఎవరు అనేది కూడా తెలుసుకోలేదు. షూటింగ్‌ ప్రారంభమయ్యాకనే రామ్‌చరణ్‌, తారక్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులని తెలిసింది. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నాను. చరణ్‌, తారక్‌లకు ఇన్నేళ్ల తర్వాత వాళ్ల స్టార్‌డమ్‌కు సరిపడా హిట్‌ వచ్చిందని భావిస్తున్నా’’

‘‘నేనింకా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూడలేదు. సినిమా విడుదలైన సమయంలో నేను ముంబయిలో ఉన్నాను. అక్కడ పలు థియేటర్లలో టిక్కెట్ల కోసం ప్రయత్నించాను. కానీ ఎక్కడా ఖాళీ లేదు. ప్రతి సినిమా హాలు హౌస్‌ఫుల్లే‌. ప్రస్తుతం వేరే సినిమా షూటింగ్‌ పనుల కోసం బెంగళూరుకు వచ్చాను. ఇక్కడ కూడా థియేటర్లు ఫుల్‌. వచ్చేవారమైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్లు దొరుకుతాయని అనుకుంటున్నా’’ అని శ్రియ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని