BRO: ‘బ్రో’నే కాదు ‘జెర్సీ’ అవకాశం మిస్‌ అయిన హీరోయిన్‌.. ఎవరంటే?

నాని హిట్‌ చిత్రం ‘జెర్సీ’, పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ల ‘బ్రో’ సినిమాల్లో నటించే అవకాశం మిస్‌ అయింది ఓ హీరోయిన్‌. ఆమె ఎవరంటే?

Published : 01 Aug 2023 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) హీరోలుగా తెరకెక్కిన ‘బ్రో’ (BRO)లో నటించే అవకాశం కోల్పోయినట్లు నటి రెబా మోనికా జాన్‌ (Reba Monica John) ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. నాని కథానాయకుడిగా రూపొందిన ‘జెర్సీ’ (Jersey)లోనూ యాక్ట్‌ చేసే ఛాన్స్‌ మిస్‌ అయ్యాయని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపిందామె. అనువాద చిత్రం ‘విజిల్‌’తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ హీరోయిన్‌ ‘సామజవరగమన’ (samajavaragamana)తో మంచి విజయాన్ని అందుకుంది. తాను మిస్‌ అయిన అవకాశాల గురించి రెబా ఏం చెప్పిందంటే?

‘‘బ్రో’ కోసం లుక్‌టెస్ట్‌ చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) సోదరి పాత్ర కోసం నన్ను అనుకున్నారు. సెలెక్ట్‌ అయ్యానో, లేదోనన్న విషయాన్ని తర్వాత తెలియజేస్తామన్నారు. కారణమేంటో తెలియదుగానీ నన్ను ఎంపిక చేయలేదు. నేను లుక్‌టెస్ట్‌లో పాల్గొన్న రోజే ‘హాస్య మూవీస్‌’ సంస్థ నిర్మాతలను కలిశా. నా మేనేజరు, ఆ ప్రొడ్యూసర్స్‌ స్నేహితులుకావడంతో హాస్య మూవీస్‌ కార్యాలయానికి వెళ్లాం. అక్కడున్న దర్శకుడు రామ్‌ అబ్బరాజు నన్ను చూసి ఓ సెల్ఫీ అడిగారు. అప్పటికి నేనింకా తెలుగులో సినిమా చేయలేదు కాబట్టి ‘నేను మీకు తెలుసా?’ అని ప్రశ్నించా. ‘నేను ‘సామజవరగమన’ అనే సినిమా చేయబోతున్నా. అందులో హీరోయిన్‌గా నిన్ను తీసుకుందామంటే.. నువ్వు తెలుగులో నటించవని ఎవరో చెప్పారు. అందుకే ప్రయత్నం ఆపేశా. కానీ, నువ్వే ఇప్పుడు ఇలా వచ్చావ్‌’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కథ విన్నా. నాకు బాగా నచ్చింది. అలా ఓ అవకాశం పోతే మరొకటి దక్కింది. పవన్‌ కల్యాణ్‌ సర్‌తో కలిసి తెరను పంచుకునే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’’ అని రెబా పేర్కొంది.

పవన్‌పై అడిగిన ప్రశ్నకు మాత్రమే స్పందించిన ఊర్వశీ రౌతేలా.. ఏమన్నారంటే

తనకు హీరో నాని (Nani) అంటే అభిమానమని తెలిపింది. ఆయన నటించిన ‘జెర్సీ’ సినిమా కోసం హైదరాబాద్‌ వచ్చానని, దానికీ లుక్‌టెస్ట్‌లో పాల్గొన్నానని, డేట్స్‌ కారణంగా ఆ చిత్రంలో నటించలేకపోయానని వివరించింది. శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సామజవరగమన’ ప్రస్తుతం ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘బ్రో’ థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని