Shankar Mahadevan: కల నిజమవుతుందని ఊహించలేదు: శంకర్‌ మహదేవన్‌

ఉత్తమ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు రావడంపై శంకర్‌ మహదేవన్‌ ఆనందం వ్యక్తంచేశారు. ఈమేరకు తన ఇన్స్టాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 07 Feb 2024 17:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శంకర్ మహదేవన్‌, జాకిర్ హుస్సేన్‌ల ‘దిస్‌ మూమెంట్‌’ ఉత్తమ గ్లోబల్‌ మ్యూజిక్ ఆల్బమ్‌గా గ్రామీ అవార్డును అందుకొంది.  ‘శక్తి’ బ్యాండ్‌ పేరిట ఈ పాటను ఎనిమిది మంది ప్రతిభావంతులైన సంగీత కళాకారులు కంపోజ్‌ చేశారు. తాజాగా శంకర్‌ మహదేవన్‌ (Shankar Mahadevan) ఇన్‌స్టాగ్రామ్‌లో అవార్డు అందుకున్న ఫొటోలు షేర్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. ‘‘ఎక్కడైతే సంగీతం నేర్చుకున్నానో ఆ  బ్యాండ్‌తో కలిసి గ్రామీ అవార్డు అందుకుంటానని ఊహించలేదు. శక్తి బ్యాండ్ నా కలను నిజం చేసింది. మేము అనుకున్నది సాధించాం. కలలు సాకారం అవుతాయని చెప్పడానికి ఇదే సరైన సమయం ’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు ఆయన అభిమానులు స్పందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘నిజంగా ఇది గర్వించదగ్గ క్షణం’,  ‘మీరు ఈ అవార్డుకు అర్హులు’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరిగింది. ప్రపంచ దేశాల్లోని సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక శక్తి బ్యాండ్‌ అవార్డును అందుకోవడంపై ప్రధాని మోదీ కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘సంగీతంపై మీకున్న అంకితభావంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది. ఈ విజయం మీ కష్టానికి నిదర్శనం. కొత్తతరం కళాకారులు పెద్ద కలలు కనేలా మీరు స్ఫూర్తి నింపారు’ అని మోదీ పోస్ట్‌ పెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని