Shruti Haasan: నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరూ మెచ్చుకోలేదు.. కానీ..: శ్రుతి హాసన్‌

ప్రముఖ కథానాయిక శ్రుతి హాసన్‌‌(Shruti Haasan)‌ అన్ని భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ బిజీ అయిపోయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపింది. 

Updated : 28 Dec 2022 12:23 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం శ్రుతి హాసన్‌(Shruti Haasan)‌ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఈ అమ్మడు నటించిన సినిమాలు వరసగా ప్రేక్షకులను అలరించనున్నాయి. టాలీవుడ్‌లో ఉన్న అగ్రహీరోలందరి సరసన ఆడిపాడుతున్న శ్రుతి తాజాగా ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌, సినిమా పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాల్లో నటించాలంటే వయసుతో సంబంధంలేదని, అది కేవలం ఒక సంఖ్యమాత్రమేనని చెప్పింది. సోషల్‌మీడియాలో నటీనటుల వయసు గురించి అనేక రకాలుగా మాట్లాడతారని.. కానీ, ఏ వయసులో ఉండే అందం ఆ వయసులో ఉంటుందని శ్రుతి వెల్లడించింది. తాను చేసే పాత్రలపై మాత్రమే దృష్టిపెడుతానని.. ఇతర విషయాల గురించి ఆలోచించనని స్పష్టం చేసింది.

ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ..‘‘ప్రేక్షకులు ఎవరైనా నటీనటులు బాగా చేయాలని కోరుకుంటారు. నేను చేసిన కొన్ని పాత్రలు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ, నేను ప్రతి సినిమాకు మెరుగవుతూ వచ్చాను. ప్రతి చిత్రంలో నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను ఎవరూ మెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు సినిమాలపై నాకు ఉన్న తపన అందరికీ అర్థమైంది. ఇప్పుడు నా గురించి, నా నటన గురించి  అందరూ మాట్లాడుకుంటున్నారు’’ అని తనను ఆదరించే ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

గత కొన్నేళ్లుగా శాంతను హజారిక(Santanu Hazarika)తో ప్రేమలో ఉన్న శ్రుతి అతడిని ఇటీవల పొగడ్తలతో ముంచెత్తింది. శాంతను లాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారంది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రుతి ప్రస్తుతం చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలో నటిస్తోంది. అలాగే బాలకృష్ణతోపాటు ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఆడిపాడనుంది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా రానున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’(Salaar)లోనూ శ్రుతి కనిపించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని