SidSriram: మోస్ట్ వాంటెడ్ సింగ‌ర్‌

సంగీతానికి భాష అవ‌సరం లేదు భావం ఉంటే స‌రిపోతుంది అనే మాట‌కు సిద్ శ్రీరామ్ నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తాడు.

Updated : 19 May 2021 12:04 IST

సంగీతానికి భాష అవ‌సరం లేదు భావం ఉంటే స‌రిపోతుంది అనే మాట‌కు సిధ్‌ శ్రీరామ్ నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తాడు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ సినీ సాహిత్యాన్ని అలరించేలా ఆల‌పించి ఎంద‌రో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ మోస్ట్ వాంటెడ్ సింగ‌ర్‌గా మారాడు. గాయ‌కుడిగానే కాకుండా సంగీత దర్శ‌కుడిగానూ ప్ర‌తిభ చాటిన సిధ్‌ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు...

సిధ్‌ శ్రీరామ్ అస‌లు పేరు సిద్ధార్థ్ శ్రీరామ్.  శ్రీరామ్‌, ల‌త దంప‌తుల‌కు 1990 మే 19న జ‌న్మించారు. సిధ్‌ తండ్రి వ్యాపారి. త‌ల్లి మ్యూజిక్ టీచ‌ర్‌. సోద‌రి ప‌ల్ల‌వి శ్రీరామ్‌ భ‌ర‌త‌నాట్యం క‌ళాకారిణి. సిధ్‌ కుటుంబం 1991లో చెన్నై నుంచి కాలిఫోర్నియాకి వెళ్లింది. అక్క‌డే సిధ్‌ త‌ల్లి క‌ర్ణాటక సంగీతానికి సంబంధించి ఓ ఇన్‌స్టిట్యూట్ నెల‌కొల్పారు. సంగీత నేప‌థ్యం ఉన్న కుటుంబం కావ‌డంతో చిన్న‌ప్ప‌టి నుంచే శ్రీరామ్‌కు పాట‌ల‌పై ఇష్టం ఏర్ప‌డింది. త‌న మూడో యేటనే వేదిక‌పై పాట ఆల‌పించి ఆశ్చ‌ర్యంలో ప‌డేశాడు. బెర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి మ్యూజిక్ ప్రొడ‌క్ష‌న్ అండ్ ఇంజినీరింగ్‌లో ప‌ట్టా పొందాడు. త‌న‌కు ఊహ తెలిశాక సంగీతాన్ని సీరియ‌స్‌గా తీసుకుని ఆల్బ‌మ్స్ రూపొందించి వాటిని యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవాడు. అవి అభిమానగ‌ణం సంపాదించ‌డంతోపాటు సంగీత ద‌ర్శ‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ జాబితాలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ ఉన్నారు.

సినిమా అవ‌కాశం..

ఏఆర్ రెహ‌మాన్ క‌డ‌ల్ (త‌మిళం) చిత్రంతో సిధ్‌ని సినీ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. చెన్నైలో రెహ‌మాన్‌కి ఓ స్టూడియో ఉంది. అక్క‌డే 2011లో తొలిసారి రెహ‌మాన్‌ని క‌లిశారు సిధ్‌. ఇద్ద‌రి మ‌ధ్య సంగీత చ‌ర్చ‌లు జ‌రిగాయి. దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత క‌డ‌ల్‌లో ఓ పాట పాడాలంటూ రెహ‌మాన్ నుంచి ఫోన్ వ‌చ్చింది. ఎన్నో ఏళ్ల క‌ల నిజ‌మ‌వుతుంద‌ని భావించిన సిధ్‌కి ఓ చిక్కొచ్చింది. రెహ‌మాన్ ఫోన్ చేసిన స‌మ‌యంలో సిధ్‌ బోస్ట‌న్‌లో ఉన్నారు. ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో ఉన్న సిధ్‌కి రెహ‌మాన్ ఓ ఐడియా ఇచ్చారు. టెక్నాల‌జీని (రిమోట్ సిస్టం) ఉప‌యోగించి ఆ పాట‌ను రికార్డు చేశారు. 4 గంట‌ల్లో పాట‌ని పూర్తి చేశారు. అదే ‘ఆడియే’ గీతం. తెలుగులో ‘యాడికే’ అంటూ సాగుతుంది.

రెహ‌మాన్‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ..

సిధ్‌ తొలి పాట త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌కత్వంలోనే సిధ్‌ రెండో పాట‌ని ఆల‌పించారు.‘ఐ’ చిత్రంలోని ‘నువ్వుంటే నా జ‌త‌గా’ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిన విష‌య‌మే. కొత్త స్వ‌రాన్ని ప‌రిచ‌యం చేశారంటూ రెహ‌మాన్‌ని ప్ర‌శంసించారంతా. రెహ‌మాన్ స్వ‌ర‌ప‌రిచిన 24,  స‌చిన్‌, అదిరింది, 2.ఓ, స‌ర్కార్‌, సాహ‌సం శ్వాస‌గా సాగిపో, 99 సాంగ్స్‌ చిత్రాల్లోనూ త‌న గ‌ళం వినిపించారు సిధ్‌.

బ్రేక్ ఇచ్చిన గీత‌గోవిందం

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌గా తెర‌కెక్కిన గీతగోవిందంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట పాట సిధ్‌ కెరీర్‌ని మ‌లుపుతిప్పింది. చిన్న‌పెద్దా తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులంతా ఆ గానానికి మంత్ర ముగ్ధులయ్యారు. అప్ప‌టి నుంచి అతను ఏ పాట పాడినా అది పెద్ద హిట్ అందుకుంటూనే ఉంది. అందుకే చిన్న సినిమాల్లో సిధ్‌ పాట ఉండేలా చూసుకుంటున్నారు ద‌ర్శ‌క‌-నిర్మాతలు. అతని పాట వ‌ల్ల సినిమాకే క్రేజ్ వ‌స్తుంది మ‌రి! హుషారులోని ‘ఉండిపోరాదె’, ట్యాక్సీవాలాలోని ‘మాటే విన‌దుగా’, ప‌డిప‌డిలేచె మ‌న‌సులోని ‘ఏమై పోయావే’, డియ‌ర్ కామ్రేడ్‌లోని ‘క‌డ‌ల‌ల్లే వేచె కనులె’, ఫ‌ల‌క్‌నుమా దాస్‌లోని ‘అరెరె మ‌న‌సా’,  అల వైకుంఠపురములో ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’,  శ‌శిలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’, వ‌కీల్‌సాబ్‌లోని ‘మ‌గువా మ‌గువా’ సిధ్‌కి మంచి గుర్తింపు తెచ్చాయి.

జాన‌ప‌దంతోనూ..

హృద్యంగా పాట‌లు పాడే సిధ్‌ జాన‌ప‌దాన్ని సైతం ఆల‌పించి ఔరా అనిపించాడు. న‌ల్ల‌మ‌ల చిత్రం కోసం తొలిసారి ఈ ప్ర‌యోగం చేశాడు. ఏమున్న‌వే పిల్లా అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్ కొత్త సిద్‌ని ప‌రిచ‌యం చేసింది.

సంగీత ద‌ర్శ‌కుడిగా..

ఎన్నో మ‌ధుర‌గీతాల్ని ఆల‌పించిన సిధ్‌ ‘వాన‌మ్ కొట్టాట్ట‌మ్’ అనే త‌మిళ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా మారాడు. శ‌ర‌త్ కుమార్‌, రాధిక‌, విక్ర‌మ్ ప్ర‌భు, ఐశ్వ‌ర్య రాజేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ధ‌న శేఖ‌ర‌న్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం నిర్మించారు.

ఫేవ‌రెట్ అంటే న‌చ్చ‌దు..

మీకు ఇష్ట‌మైన గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు అని సిధ్‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. నాకు ఫేవ‌రెట్ అనే ప‌దం న‌చ్చ‌దు. గొప్ప ప‌నిచేస్తోన్న‌ ప్ర‌తి ఒక్క‌రు త‌మ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటుంటారనేది నా అభిప్రాయం అని స‌మాధానం ఇస్తుంటాడు.

ఓ గంట ప్రాక్టీస్‌..

ఎప్ప‌టిక‌ప్పుడు స్వ‌రాన్ని కొత్తగా వినిపించేందుకు త‌గిన క‌స‌రత్తు చేయాల్సిందే అంటాడు సిధ్‌. ఇప్ప‌టికీ రోజూ క‌నీసం గంట‌సేపు క‌ర్ణాట‌క సంగీతం అభ్యాసం చేస్తాడు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని