Sonu sood: అనాథ పిల్లల కోసం.. సోనూసూద్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

కొవిడ్‌ సమయంలో ఎంతోమందికి అపన్నహస్తం ఇచ్చి ఆదుకున్న సోనూసూద్‌ (Sonu sood).. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

Published : 30 May 2023 10:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌ (Sonu sood). ఆ తర్వాత అవసరం అని ఎవరు పోస్ట్‌ పెట్టిన వారి వివరాలు కనుకొని ఎంతోమందికి సాయం చేశాడు. ఆయన నుంచి సాయం పొందిన వారు ఏకంగా గుడి కట్టి ఆయనపై అభిమానాన్ని చూపుతున్నారు. తాజాగా సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనాథ పిల్లలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు.

సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. వారంతా ఆయన పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బిహార్‌కు చెందిన ఓ యువకుడు సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభించాడు. ఇప్పటికే అందులో 100 మంది పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్‌ అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడారు. ఆయనతో చర్చించిన తర్వాత.. పిల్లలకు మెరుగైన వసతి, విద్య, ఆహారం అందించడానికి కావాల్సిన సాయం చేశారు. అంతేకాదు ఆ పిల్లల కోసం కొత్తగా స్కూల్‌ బిల్డింగ్‌ను కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఆ పిల్లల బాధ్యతలో తాను కూడా భాగమవుతానని పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరలవుతుండగా.. సోనూసూద్‌పై నెటిజన్లు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గొప్ప మనసు చాటుకున్నారు’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సోనూసూద్‌ ఫతేహ్‌’ (Fateh) సినిమాలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యాక్షన్‌ చిత్రంగా రానున్న ఈ సినిమాకు అభినందన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత ‘కిసాన్‌’ (Kisaan) చిత్రంలో నటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని