Maruthi: అన్ని జాగ్రత్తలు తీసుకొని.. డైరీ వల్ల ఇంట్లో వాళ్లకు దొరికిపోయాం..

వెన్నెల కిషోర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలా మొదలైంది’ కార్యక్రమానికి దర్శకుడు మారుతి దంపతులు వచ్చారు. వాళ్లు చెప్పిన సరదా ముచ్చట్లు మీకోసం..

Updated : 11 May 2023 12:42 IST

అందరినీ తన చిత్రాలతో నవ్వించే దర్శకుడు మారుతి తన భార్య స్పందనతో కలిసి ‘అలా మొదలైంది’ కార్యక్రమానికి వచ్చారు. వాళ్లిద్దరి జీవితంలో జరిగిన సరదా సంగతులతో షోలో నవ్వులు పూయించారు. స్పందన రాసిన డైరీ వల్లే తమ పెళ్లి జరిగిందంటూ.. ప్రేమించుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. వాళ్ల లైఫ్‌లోని బెస్ట్‌ సర్‌ప్రైజ్‌లు, మర్చిపోలేని జ్ఞాపకాలను పంచుకున్నారు. అవేంటో మీరు చదివేయండి..

ఎవరైనా ముందు అమ్మాయిని కలిసి.. వాళ్ల తల్లిదండ్రులను కలుస్తారు.. కానీ మీరు అలా చేయలేదట..?
మారుతి: బందర్‌లో జూనియర్‌ జేసీ వింగ్‌ అని ఒక క్లబ్‌ ఉండేది. అందులో స్పందన వాళ్ల అమ్మగారు చాలా చురుగ్గా ఉండేవారు. అలా మొదట ఆవిడ పరిచయమయ్యారు. ఒకసారి అందరం కలిసి డిన్నర్‌కు వెళ్లాం. అక్కడ స్పందనని తొలిసారి చూశాను. స్వీట్స్‌ తీసుకువచ్చింది. అప్పుడు తను పదోతరగతి చదువుతోంది. (స్పందన: పది కాదు ఎనిమిదో తరగతి అయిపోయింది అంతే). వీళ్ల స్కూల్‌ పక్కనే నేను స్టిక్కరింగ్‌ షాప్‌ ప్రారంభించాను. అప్పుడు మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనని ప్రేమిస్తున్నాను అని డైరెక్ట్‌గా చెప్పలేదు. తనంటే ఇష్టం అని తెలిసేలా చేశాను. 

స్పందన: ఎందుకో చూడగానే నచ్చారు. ఎనిమిదో తరగతిలో ఆయన ఫేస్‌ నచ్చింది. తొమ్మిదో తరగతిలో టాలెంట్‌ నచ్చింది. టెన్త్‌కు వచ్చేసరికి ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయారు(నవ్వులు).

మొదట ఎవరు ప్రపోజ్‌ చేశారు?
మారుతి: ప్రపోజ్‌ చేయడాలు లేవు. ఇష్టమని చెప్పానంతే. ఆ తర్వాత నేను హైదరాబాద్‌ వచ్చేశాను. స్పందన వాళ్లు విజయవాడ వెళ్లారు. ప్రతి విషయాన్ని డైరీలో రాయడం తనకు అలవాటు. చక్కగా.. నేను ఏరోజు కలిశాను. ఏరోజు ఏం మాట్లాడాను. మొత్తం వివరంగా రాసేసింది. అది ఒకరోజు వాళ్లింట్లో వాళ్లు చూశారు. నేను కష్టపడే విధానం అన్నీ చూసి వాళ్ల అమ్మ నాకు ఫోన్‌ చేశారు. స్పందన డిగ్రీ అయిపోయాక మా ఇద్దరి కుటుంబాల్లో అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నాం.  

ఇద్దరు రోజూ ఫోన్లు చేసుకున్నారా?
మారుతి: వాళ్లింట్లో ఫోన్‌ ఉంది. కానీ, మా ఇంట్లో లేదు. ఆ తర్వాత మేము సెల్‌ కొన్నాం. 
స్పందన: మా ఇంట్లో ఫోన్‌ ఉన్నా.. నేను రోజూ బయటకు వెళ్లి కాల్‌ చేసేదాన్ని. ఇంట్లో ఫోన్‌ వాడితే బిల్లు వచ్చినప్పుడు నంబర్‌ తెలుస్తుందని అలా చేశాను. (మారుతి: ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని.. చివరికి డైరీలో మాత్రం ఫలనా టైంకి ఫోన్‌ చేయడానికి వెళ్లా అని రాసేది..(నవ్వులు))

ఇప్పటికీ ఆ డైరీ మీ దగ్గర ఉందా?
స్పందన: ఉందండీ..
మారుతి: అన్ని జాగ్రత్తగా దాచింది. నేను తనకోసం బొమ్మలు వేసి ఇచ్చిన గ్రీటింగ్‌ కార్డ్స్‌ను కూడా దాచుకుంది. అవి ఇప్పుడు చూస్తుంటే చాలా బాగుంటుంది. 

పెళ్లికి ఏమైనా షరతులు పెట్టారా?
మారుతి: ‘సినిమాలు.. డైరెక్టర్‌ అవుతాను..’ వంటివి అనను అంటేనే పిల్లనిస్తామన్నారు. సరే అని చెప్పాను. డైరెక్టర్ అవ్వడానికి పెళ్లి అయ్యాక ఏడేళ్లు పట్టింది. సినిమాలకు సంబంధించి ఏ పనైనా చేసేవాడిని. నేను అల్లు అరవింద్‌ దగ్గరకు వెళ్లి డైరెక్టర్‌ అవ్వాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు ఆయన అడిగిన మాట ఇప్పటికీ గుర్తుంది. ‘దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వెయ్యి మంది వస్తారు. వారిలో నలుగురే విజయం సాధిస్తారు. ఆ నలుగురిలో ఉంటావనే నమ్మకం నీకుందా..?’’ అని ప్రశ్నించారు. నాకు నమ్మకం లేక మళ్లీ జాబ్‌ చేయడానికి వెళ్లిపోయాను. అప్పుడప్పుడూ సినిమా పనులు చేసేవాడిని. నిర్మాత అవ్వాలని ప్రయత్నించా. కానీ, అవన్నీ మనకు సెట్ అవ్వవని అర్థమైంది. ‘ఈ రోజుల్లో’ (Ee Rojullo) చేసే వరకు చాలా కష్టపడ్డాం. 

‘ఈ రోజుల్లో’ సినిమా చూసి ఏదో విషయంలో షాకయ్యారట.. ఏంటది?
స్పందన: ఆ సినిమాలో హీరోయిన్‌కు సగం నా డ్రెస్‌లే వాడారు. మారుతి రోజూ పొద్దున్నే లేచి నా బీరువాలోంచి వాటిని తీసుకెళ్లే వారు. ఎక్కడికి అని అడిగితే.. తర్వాత చెప్తాలే అనేవారు. 10 రోజుల తర్వాత ‘ఓ సినిమా తీస్తున్నాను. అందులోకి అవసరమని తీసుకెళ్తున్నా’ అని చెప్పారు. సినిమాకు వెళ్తే అందులో 80 శాతం నా డ్రెస్‌లే ఉన్నాయి. ఆ సినిమా హిట్‌ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 

స్పందన గారికి డమ్మి గిఫ్ట్‌ ఇచ్చి మోసం చేశారట నిజమేనా..?
మారుతి: ‘బస్టాప్‌’ షూటింగ్‌ సమయంలో తన పుట్టినరోజు మర్చిపోయి విషెస్‌ చెప్పకుండా వచ్చేశాను. తర్వాత తను ఫోన్‌ చేస్తే గుర్తొచ్చింది. అప్పుడు సెల్‌ కొని గిఫ్ట్‌ ప్యాక్‌ చేయించి సర్‌ప్రైజ్‌లాగా ఇచ్చాను. పాపం నేను మర్చిపోయా అని తెలియక. సర్‌ప్రైజ్‌ ఇచ్చా అనుకుంది.

పెళ్లి జరుగుతున్నప్పుడు మారుతి ఏదో అన్నారట..?
స్పందన: తాళి కడుతూ ‘ఒకసారి పైకి చూడవా’ అన్నారు.  ‘హమ్మయ్య ఒక పెద్ద పని అయిపోయింది. నాకు ఇక నీ టెన్షన్‌ లేదు’ అన్నారు. 

పెళ్లి తర్వాత బెస్ట్‌ మెమొరీ ఏది?
స్పందన: నేను శాకాహారిని. ఆయనకేమో నాన్‌ వెజ్ అంటే ఇష్టం. ఒకరోజు మా అత్తగారికి ఫోన్‌ చేసి రొయ్యల కూర చేయాలనుకున్నా. నూనెలో వేయగానే అవి తిరిగిపోయాయి. బతికి ఉన్నాయేమోనని భయం వేసి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాను. 
మారుతి: ఇప్పుడు చాలా బాగా వండుతుంది. నాన్‌ వెజ్‌ తినని అమ్మాయి ఇంత బాగా వండుతుందా అని మా అమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. 

పాలు తీసుకురమ్మంటే పది రోజులకు తెచ్చారట?
స్పందన: హా.. రోజూ పాలపాకెట్‌ తీసుకురమ్మని పంపేదాన్ని. దీంతో ఒకసారి 10 రోజులకు సరిపోయేన్ని పాలు తెచ్చారు. అవి ఫ్రిజ్‌లో పెడితే మొత్తం నిండిపోయింది. నాకు మారుతి దర్శకుడిగా కన్నా ప్రేమికుడిగా ఇష్టం. ఆ రోజుల్లో ఆయన ఆర్టీసీ బస్‌లో వస్తే.. నేను స్కూటీ వేసుకుని వెళ్లేదాన్ని. అలా ఇద్దరం ఎవరికీ కనిపించకుండా తిరిగే వాళ్లం. 

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లారు?
మారుతి: అసలు ఎక్కడికీ వెళ్లలేదు. అప్పుడు డబ్బులు లేవు అందుకే ఎక్కడికీ తీసుకెళ్లలేదు. కానీ, ఆ తర్వాత చాలా దేశాలకు వెళ్లాం. దాదాపు అన్నీ చూసేశాం. 

లైఫ్‌లో అందమైన జ్ఞాపకమంటే ఏం చెబుతారు?
మారుతి: నేను తనకు ఒక డ్రాయింగ్‌ వేసి ఇచ్చాను. ఇప్పుడు మా కూతురు కూడా అచ్చం అలానే డ్రాయింగ్‌ వేస్తుంది. జిరాక్స్‌ కాపీలా.
స్పందన: నా బండికి నంబర్‌ ప్లేట్‌ స్టిక్కరింగ్‌ చేశారు. ఒకరోజు నా బండిని ఎవరో వెనుక నుంచి ఢీకొట్టారు. ఆ నంబర్‌ప్లేట్‌ ముక్కలైంది. ఆ ముక్కలను ఏరుకొని దాచుకున్నాను. 

‘మహానుభావుడు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘బాబు బంగారం’, ‘పక్కా కమర్షియల్‌’ వీటిల్లో మారుతి గారికి ఏ టైటిల్‌ సెట్‌ అవుతుంది?
స్పందన: ‘భలే భలే మగాడివోయ్‌’(Bhale Bhale Magadivoy). క్యారెక్టర్‌ కూడా అదే. అన్నీ మర్చిపోతారు. మారుతి ఏ సినిమా కథ అయినా తొలుత నాకే చెబుతారు. ‘భలే భలే మగాడివోయ్‌’ చెప్పేటప్పుడు నిద్రపోయాను. ఎక్కువగా అలుగుతూ ఉంటారు. మా అమ్మాయిని అడిగితే ఈ విషయం బాగా చెబుతుంది.
మారుతి: స్పందన చాలా పాజిటివ్‌ పర్సన్‌. ఇప్పుడు నా సినిమా కథలు నా కూతురు వింటుంది. తర్వాత ఏంటి.. ఏ ప్రాజెక్ట్‌ అని అడుగుతుంటుంది. 

మారుతి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్‌ చెప్పండి?
స్పందన: తన జేబులో ఒక చిన్న గంధం ముక్క ఉంటుంది. జోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు. అంతకు మించి సీక్రెట్స్‌ ఏమీ లేవు. 

స్పందన సలహాలతో మారుతి గేమ్స్‌ ఎలా ఆడారు.. ఒకరికోసం మరొకరు ఏ పాటలు అంకితమిచ్చారో తెలుసుకోవాలంటే ‘అలా మొదలైంది’ షోలో వీళ్ల ఎపిసోడ్‌ను ‘ఈటీవీ విన్‌’ యాప్‌లో వీక్షించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు