Bollywood: మెరుపులెక్కువ.. గెలుపు తక్కువ

ఈ ఏడాదికి గుడ్‌ బై చెప్పే సమయం మరికొన్ని రోజుల్లో రానుంది. గతేడాదితో పోలిస్తే.. 2023లో బాలీవుడ్‌ సోయగాల సందడి తెరపై బాగానే కనిపించింది.

Updated : 23 Dec 2023 09:29 IST

బాలీవుడ్‌ నాయికలతో విజయం దోబూచులాట

ఈ ఏడాదికి గుడ్‌ బై చెప్పే సమయం మరికొన్ని రోజుల్లో రానుంది. గతేడాదితో పోలిస్తే.. 2023లో బాలీవుడ్‌ సోయగాల సందడి తెరపై బాగానే కనిపించింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. వారి అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు ఈ అందాల తారలు. చిత్రపరిశ్రమలో కథానాయికలపై ఒకసారి స్టార్‌ స్టేటస్‌ పడిందే చాలు.. ఏడాదిలో వరుసగా నాలుగైదు సినిమాలు చేస్తూ..తెరపై వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ అందులో హిట్‌ మాట వినిపించి సత్తా చాటింది కొందరే. మరి ఈ ఏడాది అదృష్టం కలిసొచ్చిన అందాల భామలు ఎవరు?పరాజయాల్ని అందుకున్న నాయికలు ఎవరు?


దీపిక యాక్షన్‌ దూకుడు

ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో జోరుమీదున్న మరో కథానాయిక దీపికా పదుకొణె. ‘పఠాన్‌’, ‘జవాన్‌’ సినిమాలతో సినీప్రియుల దృష్టిని తనవైపుకు తిప్పుకుందీ భామ. సినిమాల్లో హీరోలకు దీటుగా యాక్షన్‌ సన్నివేశాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది ఆమె నటించిన ‘గెహ్రాయీ’, ‘సర్కస్‌’ లాంటి సినిమాలు ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయాయి. కానీ ఆ సినిమాల ప్రభావం ఈ సంవత్సరం మచ్చుకైనా రానీయకుండా.. తనదైన యాక్షన్‌ సన్నివేశాలతో భేష్‌ అనిపించుకుంది దీపిక. ఈ ఏడాది విజయపథంలో దూసుకుపోతున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రకథానాయకుల సినిమాల్లో కథానాయికగా అవకాశాలను సొంతం చేసుకుంది.


ప్రేమకథతో మెరిసిన జాన్వీ..

భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. బిజీగా గడుపుతోంది యువకథానాయిక జాన్వీ కపూర్‌. త్వరలో ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతుందీమె. గతేడాదితో పోలిస్తే ఆమెకు.. ఈ సంవత్సరం కలిసొచ్చిందనే అనుకోవచ్చు. వరుణ్‌ ధావన్‌, ఆమె జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం ‘బవాల్‌’.. ఈ ఏడాది విడుదలై  విమర్శకుల ప్రశసంలు అందుకుంది. వీళ్లే కాకుండా ఈ ఏడాది ఎన్నో విజయవంతమైన చిత్రాలతో కరీనా కపూర్‌, అనన్యపాండే, కియారా తదితర కథానాయికలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.


హిట్టివ్వని టవల్‌ ఫైట్‌

గత రెండుమూడేళ్లుగా కత్రినా కైఫ్‌ నటించిన సినిమాలు ఫర్వాలేదనిపించాయి. 2022లో వెండితెరపై అలరించినా ‘ఫోన్‌ బూత్‌’ చిత్రంతో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకుందీ కత్రినా. ఈ ఏడాది సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘టైగర్‌ 3’తో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందామె. ఇందులో జోయాగా కనిపిస్తూ.. కళ్లు చెదిరే యాక్షన్‌ సన్నివేశాలతో, టవల్‌ ఫైట్‌తో కుర్రకారుల్ని ఉర్రూతలూగించింది కత్రినా. ఆమె నటనతో సినీప్రియుల ఫిదా చేసినా.. ఈ సినిమా మాత్రం వాణిజ్య పరంగా ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. త్వరలో ఆమె నటించిన ‘మెరీ క్రిస్మస్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


ఈ సారీ నిరాశే

ఈ ఏడాది వరస సినిమాలతో ప్రేక్షకులను అలరించినా.. ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయింది కథానాయిక కంగనా రనౌత్‌. నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూనే.. మరోవైపు దర్శకనిర్మాతగా రాణిస్తోందీమె. గతేడాది ఆమె నటించిన ‘ధాకడ్‌’ సినిమా కూడా ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. ఈ ఏడాది ఆమె కీలక పాత్రలు పోషించినా ‘చంద్రముఖి 2’, ‘టీకూ వెడ్స్‌ షేరు’, ‘తేజస్‌’ ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా విజయాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడే కాదు గత రెండు మూడేళ్లుగా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశే మిగులుస్తున్నాయి. 2023 పరాజయాల్ని ఆమె ఖాతాలో వేసుకున్న కంగనా.. వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఎమర్జెన్సీ’ సినిమాతోనైనా హిట్‌ బాట పడుతుందో లేదో చూడాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని