Tollywood: మరో అవకాశం మిగిలే ఉంది

పరాజయాలు ఎదురైతేనేం?మా కోసం మరో పాత్ర.. మరో సినిమా ఎదురు చూస్తోందని చాటి చెబుతూ కొత్త అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు నవతరం నాయికలు.

Updated : 16 Apr 2024 09:23 IST

పరాజయాలు ఎదురైతేనేం?మా కోసం మరో పాత్ర.. మరో సినిమా ఎదురు చూస్తోందని చాటి చెబుతూ కొత్త అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు నవతరం నాయికలు. అందం, ప్రతిభతోపాటు... సినిమా వ్యాపారంలో చోటు చేసుకున్న మార్పులూ వాళ్లకి కలిసొస్తున్నాయి.

చిత్రసీమలో జయాపజయాలేవీ శాశ్వతం కాదు. వరుస విజయాలతో పరుగులు పెట్టిన ప్రయాణాలకీ ఎక్కడో ఓ చోట బ్రేక్‌ పడటం చూస్తుంటాం. అలాగే పరాజయాలు పలకరిస్తున్నా, వాటినే పాఠాలుగా మలచుకుని విజయాల బాట పట్టినవాళ్లూ చాలామందే. గత ఫలితాలకంటే ముందున్న అవకాశమే గొప్పది కాబట్టి... అది వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంతే! సరైన ఒక్క అవకాశం చాలు... కెరీర్‌ మలుపు తిరగడానికి! ఈ విషయాన్ని నవతరం కథానాయికలు బాగా అర్థం చేసుకుంటున్నారు. పరాజయాలు ఎదురైనా నీరుగారిపోవడం లేదు. తమదైన రోజు కోసం ఓపికతో ఎదురు చూసి, కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు.  

ఆ అభిప్రాయం తప్పంటున్నారు

ఒకట్రెండు పరాజయాలు ఎదురవ్వగానే ఇక కెరీర్‌ ముగిసినట్టే అనే మాటలు చిత్రసీమలో వినిపించడం సహజమే. ఆ అభిప్రాయం తప్పు అని చాలా మంది నవతరం హీరోయిన్లు రుజువు చేస్తున్నారు. మీనాక్షి చౌదరికి ‘హిట్‌ 2’ మినహా ఇప్పటిదాకా సరైన విజయమే లేదు. ‘గుంటూరు కారం’లో నటించినా, అది చిన్న పాత్రే. కానీ అవకాశాల విషయంలో ఆమె జోరు ప్రదర్శిస్తోంది. ‘మట్కా’, ‘లక్కీభాస్కర్‌’ చిత్రాలతోపాటు, విష్వక్‌సేన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు తమిళ చిత్రసీమపైనా ఆమె దృష్టి సారించింది. విజయ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘గోట్‌’లో ఆమె ఓ కథానాయికగా నటిస్తోంది. ‘ఏజెంట్‌’ సినిమాతో పరిచయమైన సాక్షి వైద్య ఇప్పటిదాకా విజయాన్ని రుచి చూడలేదు. ఆమె అందం, ప్రతిభే ఆలంబనగా కొత్త అవకాశాల్ని అందుకొంటోంది. శర్వానంద్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది.

ఆరంభంలో అదరగొట్టిన కృతిశెట్టికి ఆ తర్వాత వరుసగా పరాజయాలే. తొలి చిత్రం ‘ఉప్పెన’ తర్వాత ఆ స్థాయి విజయమే దక్కలేదు. అయినా సరే, అవకాశాలు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. ‘కస్టడీ’ తర్వాత జోరు తగ్గినా, శర్వానంద్‌ చిత్రం ‘మనమే’ రూపంలో మరో అవకాశం చేతికందింది. ఆ చిత్రంతో విజయాన్ని అందుకుంటే కృతిశెట్టి కెరీర్‌ మళ్లీ గాడిన పడటం ఖాయం. అయితే కృతిశెట్టి ఈ మధ్య తెలుగు కంటే, తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. తమిళంలో మూడు, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. మంచి నటిగా గుర్తింపు పొందిన మాళవిక నాయర్‌కి ఈ మధ్య సరైన విజయమే లేదు. ‘థాంక్యూ’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘అన్నీ మంచి శకునములే’, ‘డెవిల్‌’... ఇలా అన్నీ పరాజయాలే. అయినా సరే, ఆమె స్పోర్ట్స్‌ డ్రామాతో తెరకెక్కుతున్న శర్వానంద్‌ 36వ చిత్రంలో కథానాయికగా అవకాశాన్ని సొంతం చేసుకుంది. అభిలాష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, యు.వి.క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.

ఈ మధ్య పరాజయాలతో సతమతమవుతూ వచ్చిన నభా నటేశ్‌ కూడా కొత్త సినిమాలతో బిజీ అయ్యింది. నిఖిల్‌ సిద్ధార్థ్‌తో కలిసి ‘స్వయంభూ’లో నటిస్తోంది. ప్రియదర్శితో కలిసి ఓ ప్రేమకథలో నటిస్తోంది.  ‘ఒకేఒక జీవితం’తో తిరిగి విజయాల బాట పట్టిన  తెలుగు కథానాయిక రీతూవర్మకు కొన్ని రోజులుగా సరైన హిట్లు లేవు. కానీ ‘శ్వాగ్‌’ చిత్రంతో మరో అవకాశాన్ని అందుకుంది. నవతరం భామలకి అవకాశాలు రావడంలో తగ్గిన డిజిటల్‌ మార్కెట్‌ ప్రభావం కూడా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘‘సినిమాలకి ఓటీటీ మార్కెట్‌ ఇంతకుముందులా లేదు. దాంతో నిర్మాతలు సినిమాల కోసం కేటాయించే బడ్జెట్‌ బాగా తగ్గిపోయింది. స్టార్‌ కథానాయికలకైతే ఎక్కువ మొత్తంలో పారితోషికాలు ఇవ్వాల్సి ఉంటుంది. బడ్జెట్‌ పరిమితుల దృష్ట్యా స్టార్‌ కథానాయికల స్థానంలో నవతరం భామల్ని ఎంపిక చేసుకుంటున్నామ’’ని ఓ నిర్మాత ‘ఈనాడు సినిమా’తో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని