దేవదాసు హిట్‌ అయింది కదాని!

సాధారణంగా ఏ సినిమా ముగింపునకు అయినా శుభం కార్డు పడితేనే ప్రేక్షకుడి మనసు గెలిచినట్లు. శుభంగా పూర్తయితే కామెడీ అని, నాయికానాయకులు మరణిస్తే ట్రాజడీ అనీ అంటారు.

Published : 05 Jul 2023 14:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా ఏ సినిమా ముగింపునకు అయినా శుభం కార్డు పడితేనే ప్రేక్షకుడి మనసు గెలిచినట్లు. శుభంగా పూర్తయితే కామెడీ అని, నాయికానాయకులు మరణిస్తే ట్రాజడీ అనీ అంటారు. సుఖాంతం, దుఃఖాంతం అన్నమాట. ‘దేవదాసు’, ‘లైలామజ్ను’లాంటివి కొన్ని సినిమాలు దుఃఖాంతం. అలా అయితే ప్రేక్షకులు హర్షించరనీ, సుఖాంతంగానే ఉండాలనీ దర్శక-నిర్మాతలు ఆలోచిస్తారు. దుఃఖాంతం అయినా ‘దేవదాసు’ విజయవంతమైందని, ‘చిరంజీవులు’ తీస్తే ఆడలేదు. ‘లైలామజ్నూ’లో నాయికనాయకులు ఎడారి తుపానుకి మరణిస్తారు. కానీ, ఇద్దరూ స్వర్గంలో కలుసుకున్నట్టు పాట పెట్టి సుఖాంతపు ముగింపు ఇచ్చారు. ఇలాంటి సందిగ్ధాల్లో కొందరు రెండు ముగింపుల్లా తీస్తారు.

‘అమావాస్య చంద్రుడు’ సినిమా సుఖాంతమే. కానీ, ప్రేమికులిద్దరూ విడిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచనతో నిర్మాత కమల్‌హాసన్‌, దర్శకుడు సింగీతానికి వచ్చింది. దీంతో రెండు వెర్షన్‌లూ తీశారు. ఆ రెండు వెర్షన్లూ చూసిన సినీ పెద్దలు, సుఖాంతమే బాగుందన్నారు. గొప్ప దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కూడా ఆ మాటే అన్నారట. ఆయన అందులో అన్యమత ప్రేమని సమర్థించే పాత్ర ధరించారు. అందుకే ఆ సినిమాని సుఖాంతంగానే ముగించారు.

తెలుగు ప్రేక్షకులు ట్రాజడీ సినిమాలను అంతగా ఇష్టపడరు. నాయికానాయకులు ఎవరైనా చనిపోతే అస్సలు ఒప్పుకోరు. మణిరత్నం తీసిన ‘గీతాంజలి’లో కూడా ‘ఇంకెన్నాళ్లు బతుకుతారో తెలియదు. కానీ, బతికినన్నాళ్లూ సంతోషంగా ఉంటారు’ అంటూ ఆ సినిమా ముగుస్తుంది. ఇక చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ తమిళ ‘రమణ’కు రీమేక్‌. తమిళంలో విజయకాంత్‌కు ఉరిశిక్ష పడుతుంది. కానీ, తెలుగులో కూడా అలాంటి ముగింపే ఉంటే మరోలా ఉండేది. ‘ఠాగూర్‌’లో చిరంజీవికి సాధారణజైలు శిక్ష మాత్రమే పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని