MAA Elections: నేను మాట్లాడాల్సింది చాలా ఉంది.. ఇది వేదిక కాదు: మోహన్‌ బాబు

కొందరు తనని రెచ్చగొట్టాలని చూశారని, అందుకు తాను మాట్లాడాల్సింది చాలా ఉందని ప్రముఖ నటుడు మోహన్‌ బాబు అన్నారు.

Updated : 12 Oct 2021 06:44 IST

హైదరాబాద్‌: కొందరు తనని రెచ్చగొట్టాలని చూశారని, అందుకు తాను మాట్లాడాల్సింది చాలా ఉందని ప్రముఖ నటుడు మోహన్‌ బాబు అన్నారు. తన కుమారుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘కొందరు నన్ను రెచ్చగొట్టాలని చూశారు. సింహం నాలుగు అడుగులు వెనక్కేసిందని తేలిగ్గా చూడొద్దు. వేదిక దొరికింది కదా అని ఇష్టారీతిగా మాట్లాడతారా? నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. అయితే ఇది వేదిక కాదు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే వృథా. నటీనటులకు సాయం చేయాలని ఇద్దరు సీఎంలను కోరాలి. కేసీఆర్‌ను నటీనటులు ఎప్పుడైనా సన్మానించారా? జగన్‌ను ఎప్పుడైనా, ఏ వేడుకకైనా ఆహ్వానించారా?’ అని మోహన్‌ బాబు ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉండవచ్చునని, ‘మా’ అంతా ఒకటే పార్టీ అని అన్నారు. దాసరి లేని లోటును తాను భర్తీ చేయలేనని, ఇండస్ట్రీ పెద్ద అనే హోదా తనకి వద్దని తెలిపారు.

‘మా’ అనేది సేవా సంస్థ: నరేశ్‌

‘ప్రతి సంస్థలోనూ తరాలు, ఆలోచనలు మారతాయి. ‘మా’ అనేది సేవా సంస్థ. నేను పోటీ చేసిన సమయం (జయసుధ ఆధ్వర్యం)లో ఓ మార్పుని చూశా. ఆ మార్పుతోనే గెలిచాం. వెల్ఫేర్‌కి ప్రాధాన్యత ఇచ్చాం. మార్పులో మంచీ చెడూ రెండూ ఉంటాయి. దాసరి నారాయణరావుగారు లేని లోటుని మోహన్‌బాబు భర్తీ చేస్తారనే నమ్మకం ఉంది’ అని నరేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని