Anasuya: అవసరమైతే గుండు చేయించుకుంటా.. దాక్షాయణిగా మారిన అనసూయ!

‘పాత్ర డిమాండ్‌ చేస్తే గుండు చేయించుకుంటానికీ సిద్ధమే’ అని బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ సినిమాపై తనకున్న ప్యాషన్‌ను తెలియజేశారు.

Updated : 10 Nov 2021 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పాత్ర డిమాండ్‌ చేస్తే గుండు చేయించుకోవడానికీ సిద్ధమే’ అని బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ సినిమాపై తనకున్న ప్రేమని తెలియజేశారు. అనసూయ సోషల్‌ మీడియా వేదికగా తరచూ అభిమానులతో టచ్‌లో ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదాగా ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ‘మీకు పెద్ద సినిమాలో మంచి పాత్రలో నటించే అవకాశం వస్తే దానికోసం గుండు చేయించుకుంటారా?’ అని అడగ్గా ‘అవసరం అనుకుంటే తప్పకుండా..’ అని ఆమె బదులిచ్చారు.

‘రంగమ్మత్త’ను మించి..

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా కనిపించి నటిగా ఓ మెట్టుపైకెక్కారు అనసూయ. ఇప్పుడు అంతకుమించి.. అనిపించేందుకు సిద్ధమయ్యారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ రూపొందిస్తోన్న ‘పుష్ప’ చిత్రంలో ఆమె దాక్షాయణి పాత్రలో నటిస్తున్నారు. బుధవారం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పెద్ద బొట్టు, చేతికి ఉంగరాలు, మెడలో నగలు ధరించి రాజసం ఉట్టిపడే ఆమె లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలా కనిపిస్తోంది. సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు. సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకురానునంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని