Updated : 13/11/2021 10:20 IST

Kurup Review: రివ్యూ: కురుప్‌

చిత్రం: కురుప్‌; న‌టీన‌టులు: దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ్ల, ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, సన్నీ వేన్, భరత్ నివాస్ త‌దిత‌రులు; సంగీతం: సుశీన్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి, దర్శకత్వం: శ్రీనాథ్ రాజేంద్రన్; నిర్మాణం: వే ఫారర్ ఫిల్మ్స్ & ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్; విడుద‌ల‌: 12 నవంబ‌ర్ 2021

దుల్కర్ స‌ల్మాన్‌కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ‘ఓకే బంగారం’, ‘మ‌హాన‌టి’, ‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’.. త‌దిత‌ర చిత్రాల‌తో ఆయ‌న తెలుగు ప్రేక్షకుల‌కు ఎంత‌గానో చేరువ‌య్యారు. అందుకే ఆయ‌న ఏ భాష‌లో న‌టించినా ఆ సినిమాలు తెలుగులోనూ అనువాదం అవుతుంటాయి. పాన్ఇండియా చిత్రంగా ఇటీవ‌ల రూపొందిన ‘కురుప్‌’ కూడా తెలుగులో విడుద‌లైంది. మ‌రి, ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..!

క‌థేమిటంటే: మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌గా దేశ‌వ్యాప్తంగా మార్మోగిన పేరు కురుప్‌. అత‌ని వాస్తవ నేర జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కేర‌ళ‌లో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి గోపీకృష్ణన్ కురుప్ అలియాస్ జీకేగా మొద‌లైన అత‌ని జీవితం ఆ త‌ర్వాత ఎలా మారింది? సుధాక‌ర కురుప్‌గా, అలెగ్జాండ‌ర్‌గా అత‌ను ఎలా మారాడు? దారిత‌ప్పిన యువ‌కుడైన కురుప్ జల్సాలు, విలాసాల‌కు అల‌వాటు ప‌డి ఎలాంటి దురాగ‌తాల‌కి పాల్పడ్డాడు? జీవితంలో సెటిల్ అయిపోవ‌డం కోసం ఏం చేశాడు? అత‌ని కోసం అన్వేష‌ణ ప్రారంభించిన పోలీసు అధికారుల‌కు ఎలాంటి విష‌యాలు తెలిశాయనే అంశాల చుట్టూ సాగే క‌థ ఇది. కురుప్‌గా దుల్కర్ స‌ల్మాన్‌, అత‌ని ప్రేయ‌సి శార‌దాంబ‌గా శోభిత ధూళిపాళ్ల న‌టించారు.

ఎలా ఉందంటే: కురుప్ నేర‌మయ జీవితం ఆరంభం నుంచి అత‌ని గురించి చివ‌రిగా తెలిసిన విష‌యాల వ‌ర‌కూ సాగే క‌థ ఇది. కిల్లర్  కురుప్ జీవితం ఆధారంగా సినిమా అన‌గానే కేర‌ళ‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ‌య్యాయి. ఒక నేర‌స్థుడిని హీరోగా చూపించ‌డానికి ప్రయ‌త్నిస్తున్నార‌నే విమ‌ర్శలు వచ్చాయి. కానీ ఈ క‌థ‌ని ద‌ర్శకుడు అలా చూపించ‌లేదు. క‌థానాయ‌కుడిని ఓ క‌ర‌డుగ‌ట్టిన కిల్లర్‌గానే చూపించాడు. 1970, 80, 90 ద‌శ‌కాల్లో సాగే ఓ పీరియాడికల్‌ క‌థ‌గా ద‌ర్శకుడు ఈ క‌థ‌ని మ‌లిచాడు. పాత్రల్ని ప‌రిచ‌యం చేయ‌డం కోసం స‌మ‌యం తీసుకున్న ద‌ర్శకుడు మెల్లగా క‌థ‌లోకి తీసుకువెళ్లాడు. కురుప్‌కి పీట‌ర్‌తో స్నేహం మొద‌లుకొని, అతడు నేరాల‌కి పాల్పడే తీరు, అందులో నుంచి బ‌య‌టప‌డే విధానం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఒక క్రిమిన‌ల్ ఎంత క్రూర‌త్వంతో ఉంటాడో.. అవ‌న్నీ దుల్కర్ తన న‌ట‌న‌తో చ‌క్కగా ఆవిష్కరించే ప్రయ‌త్నం చేశాడు.

కురుప్ పాత్రని ఎక్కడా హీరో అన్నట్టు చూపించ‌కుండానే ఆ పాత్రని స్టైలిష్‌గా తీర్చిదిద్దాడు ద‌ర్శకుడు. కొన్ని స‌న్నివేశాల్లో స్పష్టత లోపించిన‌ట్టు అనిపించినా, సింహ భాగం సినిమా త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తితో సాగుతుంది. వాస్తవ సంఘ‌ట‌న‌ల ఆధారంగానే ఈ చిత్రం రూపొందినా, అక్కడ‌క్కడా వాణిజ్యాంశాల‌ కోసం స్వేచ్ఛని తీసుకుని స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు ద‌ర్శకుడు. గోపీకృష్ణన్ చ‌నిపోయాడ‌ని న‌మ్మించే స‌న్నివేశాలు, ఇంట‌ర్వెల్ ఎపిసోడ్‌, చివ‌రి 30 నిమిషాల డ్రామా సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. అన్ని ర‌కాల జాన‌ర్లు క‌లిసిన‌ట్టుగా అనిపించే క‌థ ఇది. శోభిత‌తో ప్రేమాయ‌ణం స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. క్రైమ్ డ్రామాలో ఉండే వేగం ఇందులో లేక‌పోయినా స‌హ‌జ‌త్వంతో సినిమా ప్రేక్షకుల్ని క‌ట్టిపడేస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: దుల్కర్ స‌ల్మాన్ వ‌న్ మేన్ షోలా ఉంటుందీ చిత్రం. అత‌ను కురుప్ పాత్రలో ఒదిగిపోయే ప్రయ‌త్నం చేశాడు. నేరం చేసే స‌న్నివేశాల్లో చాలా బాగా న‌టించారు. లుక్స్ ప‌రంగా కూడా ఆయ‌న తీసుకున్న జాగ్రత్తలు ఆక‌ట్టుకుంటాయి. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు అత‌ను క‌నిపించే తీరు మెప్పిస్తుంది. శోభిత‌, పోలీసాఫీస‌ర్‌గా ఇంద్రజిత్ సుకుమార‌న్ త‌మ న‌ట‌న‌తో క‌ట్టిప‌డేస్తారు. ప్రాధాన్యంతో కూడిన పాత్రలు చాలానే ఉన్నా, ఎక్కువ స‌న్నివేశాల్ని దుల్కర్ త‌న భుజాలపై వేసుకుని న‌డిపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రథ‌మార్ధంలో స‌న్నివేశాలు కొన్ని సాగ‌దీత‌గా అనిపించినా, పాత్రల్ని బ‌లంగా ఆవిష్కరించ‌డానికి అది అవ‌స‌రం అనిపిస్తుంది. సంగీతం, కెమెరా విభాగాలు చ‌క్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. పీరియాడిక్‌గా సాగే ఈ సినిమా కోసం నిర్మాణ ప‌రంగా తీసుకున్న జాగ్రత్తలు చిత్రానికి ప్రధాన బ‌లం. ద‌ర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్‌ ఎంతో ప‌రిణ‌తితో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ క్రిమిన‌ల్ క‌థ‌ని, అదే త‌ర‌హాలో ఎలాంటి హీరోయిజం లేకుండా దుల్కర్ స‌ల్మాన్‌ లాంటి ఓ క‌థానాయ‌కుడితో తీయ‌డం మెచ్చుకోద‌గ్గదే. కొన్ని స‌న్నివేశాలు గంద‌ర‌గోళంగా అనిపించినా చాలా వ‌ర‌కు ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు ఈ క్రైమ్ డ్రామాని. ర‌క‌ర‌కాల జాన‌ర్లతో ఓ క‌థ‌ని ఎలా తీయొచ్చో చూపించాడు.

బ‌లాలు

+దుల్కర్ స‌ల్మాన్ న‌ట‌న‌

+న‌టీన‌టులు

+నేర నేప‌థ్యంలో సాగే డ్రామా

+ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

-గంద‌ర‌గోళంగా కొన్ని స‌న్నివేశాలు

-సాగ‌దీత‌గా అనిపించే ప్ర‌థ‌మార్ధం

చివ‌రిగా: ఆస‌క్తిక‌రంగా సాగే ఓ కిల్లర్ క‌థ ‘కురుప్’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని