MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నా: రాజశేఖర్‌

ఈసారి జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నట్లు నటుడు రాజశేఖర్‌ తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు మద్దతు తెలుపుతూ ఇటీవల ఆ ప్యానల్‌ సభ్యులు...

Updated : 09 Oct 2021 15:54 IST

హైదరాబాద్‌: ఈసారి జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నట్లు నటుడు రాజశేఖర్‌ తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు మద్దతు తెలుపుతూ ఇటీవల ఆ ప్యానల్‌ సభ్యులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజశేఖర్‌ పాల్గొని తన మనసులోని మాటలు బయటపెట్టారు. అసోసియేషన్‌ అధ్యక్ష పీఠం అనేది పెత్తనం చేయడానికి కాదని.. అది ఒక బాధ్యతతో కూడిన వ్యవహారమని ఆయన అన్నారు. అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌ గెలిస్తే అసోసియేషన్‌ ఎంతో వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

‘‘మన తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది ధనవంతులు, గొప్ప నటీనటులు ఉన్నారు. అలాంటి మన పరిశ్రమ మరింత కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకోవాలి. అందుకు మన అసోసియేషన్‌కు మంచి అధ్యక్షుడు కావాలి. అధ్యక్ష పదవి అనేది పెత్తనం చెలాయించడానికి కాదు. సభ్యుల సంక్షేమం.. అసోసియేషన్‌ అభివృద్ధి కోసం పాటుపడేందుకే..! ప్రకాశ్‌రాజ్‌ మాత్రమే ఆ పదవికి పూర్తి న్యాయం చేయగలరు. ప్రకాశ్‌రాజ్‌ మంచి నటుడు. మేమిద్దరం ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. త్వరలో తప్పకుండా కలిసి పనిచేస్తాం. ఇక ‘మా’ ఎన్నికల విషయానికి వస్తే.. నాకు కూడా ‘మా’ అధ్యక్షుడిగా పోటీచేయాలనే ఆలోచన ఉండేది. అలాంటి సమయంలో  ప్రకాశ్‌రాజ్‌ మా ఇంటికి వచ్చి.. అసోసియేషన్‌ అభివృద్ధి కోసం తాను ఏం చేయాలనుకుంటున్నాడో వివరించాడు. అది విన్న తర్వాత.. నాకంటే కూడా ప్రకాశ్‌రాజే ఆ పదవికి చక్కగా సరిపోతాడని అనిపించింది. ఎందుకంటే.. అసోసియేషన్‌ అభివృద్ధికి డబ్బులు కావాలి. అందుకోసం ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు నిర్వహించాలి. ఆయనకు వివిధ భాషాలకు చెందిన ఇండస్ట్రీ వర్గాలతో సత్సంబంధాలున్నాయి. కాబట్టి ఫండ్‌ రైజింగ్‌ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయగలడు’ అని రాజశేఖర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని