Nani: మహేశ్‌ నుంచి జగదీష్‌ వరకు... నాని ప్రయాణం ఇదీ! 

నటుడిగా నాని 13 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన చిత్రాల వివరాల గురించి ప్రత్యేక కథనం.

Published : 06 Sep 2021 01:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అనుకోకుండా నటుడిగా మారి, ఎంతో అభిమానుల్ని సంపాదించుకున్న వారిలో నాని ఒకరు. రేడియో జాకీ (ఆర్జే) అయిన నాని అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, కొన్ని చిత్రాలకు క్లాప్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి నానిలోని నటుడ్ని గుర్తించి, ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోని చేశారు. ఇది జరిగి 13 ఏళ్లు గడిచింది. 2008 సెప్టెంబరు 5న రాంబాబు అలియాస్‌ మహేశ్‌గా నాని తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యారు. ఈ సందర్భంగా నాని నటించిన చిత్రాలు, పాత్రల్ని చూద్దామా...

రాంబాబు అలియాస్‌ మహేశ్.. అర్జున్‌.. సాయి

మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ‘అష్టాచమ్మా’ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, నాని, స్వాతి, భార్గవి ప్రధాన పాత్రధారులు. ఈ రొమాంటిక్ కామెడీ కథలో రాంబాబుగా, మహేశ్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించి, తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు పొందారు. నాని నటించిన రెండో చిత్రం ‘రైడ్‌’. నాని, తనీశ్‌ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాని రమేశ్‌ వర్మ తెరకెక్కించారు. ఈ రొమాంటిక్‌, యాక్షన్‌ డ్రామాలో నాని.. అర్జున్‌ పాత్రలో కనిపించి, యువతని అమితంగా ఆకట్టుకున్నారు. నాని కథానాయకుడిగా రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘స్నేహితుడా’. సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహించారు. ఇందులో సాయి అనే పాత్రలో దర్శనమిచ్చారు నాని.

మనసుని హత్తుకునే సూరి..

నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘భీమిలి కబడ్డీ జట్టు’. ఈ స్పోర్ట్స్‌ డ్రామాని తాతినేని సత్య తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూరిగా కనిపించారాయన. భావోద్వేగ సన్నివేశాల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసుని హత్తుకున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో సూరి పాత్ర చనిపోవడం కంటతడిపెట్టించింది.

గౌతమ్‌.. ప్రవీణ్‌ జయరామరాజు

నందినిరెడ్డి దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘అలా మొదలైంది’. ఇందులో ఆయన నటించిన గౌతమ్‌ పాత్ర విశేషంగా అలరించింది. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టుఎక్కారు. నానిలోని మరో విభిన్న కోణాన్ని చూపించిన సినిమా ‘పిల్ల జమీందార్‌’. కామెడీ డ్రామాగా దర్శకుడు అశోక్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో పీజే అలియాస్ ప్రవీణ్‌ జయరామరాజుగా నాని చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

కోలీవుడ్ ఎంట్రీ.. ఈగ అంటే నాని

‘వెప్పమ్‌’ అనే చిత్రంలో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు నాని. అంజన తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ‘సెగ’ పేరుతో విడుదలైంది. ఇందులో కార్తి అనే పాత్రలో కనిపించారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో నానిగానే దర్శనమిచ్చారు. ఆ పాత్ర మరణించి, ఈగగా మారే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని పాత్ర నిడివి తక్కువైనా తనదైన మార్క్‌ చూపించారు. అలా ఈగ అంటే నాని, నాని అంటే ఈగ అనేంతలా చేశారు.

వరుణ్‌ కృష్ణ.. ప్రకాశ్‌.. శక్తి

గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వంలో నాని నటించిన ప్రేమకథా చిత్రం ‘ఎటో వెళ్లిపోయిది మనసు’. ఇందులో వరుణ్‌ కృష్ణగా అలరించారు. ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ప్రకాశ్‌గా నాని కనిపించిన చిత్రం ‘పైసా’. ఈ సినిమాని కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇందులో నాని పూర్తిస్థాయి యాక్షన్‌ని చూడొచ్చు. గోకుల్‌ కృష్ణ తెరకెక్కించిన ‘ఆహా కల్యాణం’ సినిమాలో శక్తివేల్ అలియాస్‌ శక్తిగా నాని నవ్వులు పంచారు.

ద్విపాత్రాభినయం..

‘జెండాపై కపిరాజు’ చిత్రంలో నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. అరవింద్‌ శివశంకర్‌, మయకన్నన్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సుబ్బు.. లక్కీ

నాని హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఇందులో సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బుగా నాని కనిపించారు. నాని నాన్‌స్టాప్‌ నవ్వులు పంచిన సినిమా ‘భలే భలే మగాడివోయ్‌’. మారుతి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో లక్కీ అనే పాత్రలో మతిమరుపు ఉన్న వ్యక్తిగా కనిపించి, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు.

కృష్ణ.. ‘జెంటిల్‌మన్‌’

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో కృష్ణ అనే వైవిధ్య పాత్రని పోషించారు. హను రాఘవపూడి దర్శకుడు. నాని నటించిన మరో డ్యుయల్‌ రోల్‌ సినిమా ‘జెంటిల్‌మన్‌’. గౌతమ్‌, జై అనే పాత్రల్లో కనిపించి, విలన్‌గానూ మెప్పించగలనని నిరూపించుకున్నారు. ఈ చిత్రాన్ని మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు.

ఆదిత్య.. బాబు.. ఉమామహేశ్వర రావు.. నాని

విరించి వర్మ తెరకెక్కించిన ‘మజ్ను’లో ఆదిత్యగా, త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ‘నేను లోకల్‌’లో బాబుగా, శివ నిర్వాణ తెరకెక్కించిన ‘నిన్నుకోరి’లో ఉమామహేశ్వర రావుగా, వేణు శ్రీరామ్‌ తెరకెక్కించిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’లో నానిగా నటించి, అలరించారు.

కృష్ణ- అర్జున్‌ జయప్రకాశ్‌ యుద్ధం..

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణార్జున యుద్ధం’లో కృష్ణ, జయ ప్రకాశ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు.

నాగార్జునతో కలిసి..

నాగార్జునతో కలిసి నాని నటించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ఇందులో దేవగా నాగార్జున, దాస్‌గా నాని సందడి చేశారు.

జాతీయ ఉత్తమ చిత్రం.. 

క్రికెట్‌ నేపథ్యంలో నాని నటించిన ‘జెర్సీ’ 2019లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్ర పోషించారు. విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు. 

పార్థ సారథి.. విష్ణు

విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కించిన ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’లో పెన్సిల్‌ పార్థ సారథిగా, మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘వి’లో విష్ణుగా అలరించారు.

‘టక్‌ జగదీష్‌’.. వచ్చేస్తున్నాడు

‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ- నాని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో జగదీష్‌ నాయుడు పాత్రని పోషించారు.

త్వరలో..

రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో నాని  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే భారీ బడ్జెట్‌ చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ అనే కామెడీ చిత్రంలో నటిస్తున్నారు.

వ్యాఖ్యాతగా.. నిర్మాతగా

ఆర్జే, క్లాప్‌ డైరెక్టర్‌, నటుడిగానే కాదు వ్యాఖ్యాతగా, నిర్మాతగానూ నాని ప్రతిభ చూపారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ నిర్మాణ సంస్థని స్థాపించి, ‘అ!’, ‘హిట్‌’ వంటి వైవిధ్య కథల్ని ప్రేక్షకులకి పరిచయం చేశారు. బుల్లితెర కార్యక్రమాల్లో, పలు అవార్డుల వేడుకల్లో వ్యాఖ్యాతగా అలరించారు. పలు సినిమాల్లో అతిథి పాత్రలూ పోషించారు.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని